హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పనులు నిలిపివేత ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకు సదరు భూముల్లోని చెట్ల నరికివేత కొనసాగించరాదని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు చెట్ల నరికివేతను ఒకరోజు ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన తర్వాత కూడా పనులు జరిగాయంటూ తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. పిటిషన్లన్నింటిపై ఈ నెల 7న విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది.
ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అబిషేక్ సింఘ్వీ, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నదని తెలిపారు. ఇదే హైకోర్టు రిజిస్ట్రీ నుంచి నివేదిక కోరిందని, అకడి న్యాయ వివాద నేపథ్యంలో ఇకడి కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. గతంలో ఇదే హైకోర్టు 7వ తేదీ వరకు కౌంటరు దాఖలు చేయడానికి గడువు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందని, గడువు ఇవ్వాలని కోరారు.
అనంతరం పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో విచారణను వాయిదా వేస్తామంటే తమకు అభ్యంతరం లేదని అన్నారు. సుప్రీంకోర్టు కేసులో తాము వాదప్రతివాదులుగా లేనందున సదరు భూముల్లోని చెట్లను కొట్టివేయరాదన్న నిన్నటి మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. చెట్లను కొట్టివేయరాదంటూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కంచ గచ్చిబౌలిలోని భూముల్లో గురువారం ఉదయం వరకూ చెట్ల నరికివేత చర్యలు కొనసాగాయని చెప్పారు. చెట్లను కొట్టేస్తున్నప్పుడు ఫొటోలు తీస్తున్న విద్యార్థులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు. స్పందించిన హైకోర్టు, తమ ఉత్తర్వుల తర్వాత కూడా చెట్ల నరికివేత చేశారనే మధ్యంతర పిటిషన్లో కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
హెచ్‌సీయూ విద్యార్థుల తరపు న్యాయవాది వాదిస్తూ, పోలీసుల దాడులు బాగా ఎకువ అయ్యాయని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై కూడా ఉందని అన్నారు. ఇది పూర్తిగా విశ్వవిద్యాలయ స్థలమని, దాన్ని రక్షించుకోవాలన్నదే విద్యార్థుల ప్రయత్నమని చెప్పారు. దీనిపై కల్పించుకున్న హైకోర్టు.. విద్యార్థులు వేసిన వ్యాజ్యాలు, ఇతర పిటిషన్లు అన్నింటిలోనూ ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 7వతేదీకి వాయిదా వేసింది.