హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై స్పీకర్ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన ఈ పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారణ జరిపింది. పిటిషనర్లు స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన 10 రోజులకే హైకోర్టును ఆశ్రయించారని దానం, కడియం తరఫు న్యాయవాదులు తెలిపారు. గతంలో జరిగిన ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్‌కు నిర్ధిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్లను కొట్టేయాలని, లేనిపక్షంలో ఆ పిటిషన్లను డివిజన్ బెంచ్‌కి నివేదించాలని కోరారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గతంలోనే వాదన వినిపించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌కు నోటీసులు జారీ చేయవచ్చని మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. దీనికి అనుగుణంగా స్పీకర్‌కు హైకోర్టు నిర్ధిష్ట గడువు విధించాలని కోరారు.