Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర సంస్థ సీబీఐ కూడా దర్యాప్తు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈలోగా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలును నిలిపివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోయేదీ తెలియజేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే.
మంగళవారం జరిగిన విచారణలో అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ, కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్లకు విచారణార్హత లేదని, వాటిని కొట్టివేయాలని కోరారు.
కేసీఆర్, హరీశ్‌ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఘోష్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబోరన్న ప్రభుత్వ హామీని రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. కోర్టు జారీ చేయబోయే ఉత్తర్వుల ప్రతిని కూడా వెంటనే అందుబాటులోకి వచ్చేలా చూడాలని, లేకపోతే, ఈలోగానే సీబీఐ దర్యాప్తు ప్రారంభిస్తే సమస్య తలెత్తవచ్చునని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏజీ కల్పించుకుంటూ.. వాస్తవాలను సీబీఐ దర్యాప్తునకు పరిగణనలోకి తీసుకోవచ్చునని చెప్పడంతో వారిద్దరూ తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీనిపై హైకోర్టు కల్పించుకుని, పిటిషనర్లపై చర్యలు తీసుకుంటారన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. ఏ చర్యలైనా కూడా కోర్టు విచారణ పరిధిలోని అంశాలతో ముడిపడి ఉంటాయని తేల్చి చెప్పింది.
తొలుత ఏజీ వాదనలు ప్రారంభిస్తూ, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలనే నిర్ణయం తీసుకున్నందున పిటిషనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. దీనిపై హైకోర్టు కల్పించుకుంటూ.. అసెంబ్లీలో నివేదిక సమర్పించాక ఏం జరిగిందని ప్రశ్నించింది. సభలో నివేదికపై సమగ్రంగా చర్చ జరిగిందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏజీ బదులిచ్చారు. అసెంబ్లీలో రిపోర్టు పెట్టాక చర్యలు ఉంటాయని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా చర్యలు ఉంటాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైకోర్టు గుర్తుచేసింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉంటుందా.. అన్న హైకోర్టు ప్రశ్నకు ఉండబోదని ఏజీ జవాబు చెప్పారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ రిపోర్టు, ప్రభుత్వం దగ్గరున్న సమాచారం ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరుగుతుందని ఏజీ చెప్పారు. మేడిగడ్డ బరాజ్‌లోని 3, 5 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని వివరించారు. మళ్లీ హైకోర్టు కల్పించుకుని, కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉండబోదన్న విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయమంటారా.. అని ప్రశ్నించింది. ఈ దశలో పిటిషనర్ల న్యాయవాదులు కల్పించుకుంటూ.. కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఉండరాదని ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తిరిగి ఏజీ జోక్యం చేసుకుని, సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిందని, సీబీఐ సొంతంగా దర్యాప్తు చేస్తుందని తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు జారీచేసిన ఆదేశాల్లో ఎవరి పేర్లయినా ప్రస్తావించారా? అని అడిగితే ఏజీ లేదని బదులిచ్చారు.
కావాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ వెలువడిన జీవోను పరిశీలించవచ్చునంటూ ఆ ప్రతులను అందజేశారు. హైకోర్టు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కమిషన్ రిపోర్టులో తమకు ప్రతికూల అంశాలు ఉన్నాయని పిటిషనర్లు చెప్తున్నారని, మరోవైపు వాటి ఆధారంగా ఎలాంటి చర్యలూ ఉండబోవని, అంతేకాకుండా సీబీఐ దర్యాప్తునకు కూడా రిపోర్టు ఆధారం కాబోదని ప్రభుత్వం చెప్తున్నది కదా.. అని గుర్తుచేసింది. అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిగిన తర్వాత సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం జరిగిందని, తదుపరి చర్యలపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఏజీ జవాబు చెప్పారు. అయితే, ఐఏ, ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి విచారణలో పిటిషన్‌లోని అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.
దామా శేషాద్రి నాయుడు వాదనలు కొనసాగిస్తూ, కమిషన్ రిపోర్టుతో సంబంధం లేకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని, రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం చెప్తున్నదని, మరోవైపు అదే రిపోర్టులోని అంశాలను సీబీఐ దర్యాప్తు కోరుతూ వెలువరించిన నోటిఫికేషన్లో ఎందుకు ప్రస్తావించిందని ప్రశ్నించారు. నిన్నటివరకు కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టాక తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. అసెంబ్లీలో చర్చ సమయంలో కూడా కమిషన్ అనేక అవకతకలను నిగ్గు తేల్చిందని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించిందని కూడా గుర్తుచేశారు.
ఇప్పుడేమో కమిషన్ రిపోర్టుపై చర్యలు తీసుకోబోమని అంటూనే అందులోని అంశాలను ప్రస్తావిస్తూ సీబీఐ దర్యాప్తునకు నోటిఫికేషన్ జారీచేయడం ద్వారా ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరిని చాటుకుందని అన్నారు. ప్రభుత్వం చాలా తెలివిగా కుట్రతో వ్యవహరిస్తున్నదని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ప్రభుత్వ హామీకి భిన్నంగా జరిగితే అది కోర్టు పరిధిలోని అంశాల కిందకు వస్తుందని గుర్తుచేసింది. పిటిషనర్ల పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లే చర్యలు ఏమీ ఉండబోవని ప్రభుత్వమే హామీ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగానే సీబీఐ దర్యాప్తు ఉండాలని ఉత్తర్వులను జారీచేసింది.
తిరిగి ఏజీ కల్పించుకుని, కమిషన్ రిపోర్టు మినహా ఇతర అంశాల ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉంటుందని చెప్పడాన్ని న్యాయవాదులు అడ్డుకున్నారు. ప్రధాన పిటిషన్లు, ఐఏల్లోని అంశాలపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లపై పిటినర్లు రిపె్లై కౌంటర్లు కూడా దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.
ఒక దశలో ఘోష్ కమిషన్ నివేదికలోని అంశాలపై ఇరుపక్షాలు గట్టిగా వాదప్రతివాదాలు చేసుకున్నారు. దీంతో ధర్మాసనమే ఆ అంశాలను చదివింది. పేరా 3లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం జరిగినందున కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 3 కింద జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఉంది. కమిషన్ ఈ ఏడాది జులై 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం, లోపాలు, అవకతవకలను గుర్తించినట్టు పేర్కొంది. తీవ్రమైన క్రిమినల్ చర్యలకు అవసరమయ్యే అనేక లోపాలను గుర్తించింది.
ప్రణాళిక లేకుండానే మూడు బ్యారేజీల నిర్మాణం జరిగింది.. అని ఉంది. ఈ విషయాలను హైకోర్టు దృష్టికి తెచ్చేందుకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రయత్నించారు. అందులోని 8వ పేరాలో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లినట్టు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక పేర్కొంది. ఈ వ్యవహారంలో కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ జరిపింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలనే నిర్ణయం అసెంబ్లీ తీసుకుంది.. అని ఏజీ చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ అంశాలన్నింటినీ పూర్తిగా చదివిన తర్వాత ధర్మాసనం.. కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్యలు లేవుకాబట్టి పిటిషనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పగా, అవునని ఏజీ మరోసారి భరోసా ఇచ్చారు. పిటిషనర్ల న్యాయవాదులు కల్పించుకుని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని సవాలు చేస్తామని చెప్పగా, అది వేరే విషయమని, విడిగా మరో పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.