హైదరాబాద్, నవంబర్ 22, (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయంలోగా తేల్చాలని సూచించింది. నిర్దిష్ట సమయాన్ని నిర్వచిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కోర్టును ఆశ్రయించారన్న వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఇప్పటికే అనర్హత పిటిషన్లు పెండింగ్ ఉన్న సమయాన్ని, ఎమ్మెల్యేల ఐదేండ్ల పదవీ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు లక్ష్యం, ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద విచారణ చేపట్టేందుకు నాలుగు వారాల్లోగా స్పీకర్ షెడ్యూల్‌ను ఖరారు చేయాలంటూ గతంలో సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును రద్దుచేసింది.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించారని, వారిపై అనర్హత వేటు వేయాలన్న తమ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపి గత నెల 9న తీర్పు వెలువరించింది. స్పీకర్‌కు నేరుగా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ.. అనర్హత పిటిషన్లపై షెడ్యూలు ఖరారు చేయడానికి ఫైళ్లను స్పీకర్ ముందుంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఆ తర్వాత నాలుగు వారాల్లో షెడ్యూలు నిర్ణయించాలని, లేదంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలనే పిటిషన్లపై తామే తేల్చాల్సి ఉంటుందని తీర్పు వెలువరించింది. ఈ తీర్పును రద్దు చేయాలంటూ శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు వేర్వేరుగా రెండు అప్పీళ్లను దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సమగ్ర విచారణ జరిపింది. శుక్రవారం 78 పేజీల తీర్పును వెలువరించింది.
‘పార్టీ ఫిరాయింపుల వ్యవహారాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పలు కేసుల్లో వెలువడిన తీర్పులన్నింటినీ పరిశీలిస్తే.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు కింద అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్‌కు ఉన్నది. సహేతుక సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి’ అని తీర్పులో పేర్కొన్నారు. అదే సమయంలో స్పీకర్ నిర్ణయం కిహటో హోలోహాన్, రాజేంద్రసింగ్ రాణా, సుభాష్ దేశాయ్ కేసుల ప్రకారం న్యాయసమీక్షకు లోబడి ఉంటుందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ ఉంటారని, ఒక కోర్టు విధుల్లోకి మరో కోర్టు జోక్యం చేసుకోరాదని గతంలో ఎరబ్రెల్లి దయాకర్‌రావు కేసులో ఇదే హైకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని ఉదహరించింది. అయితే, ఈ తీర్పు సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు ముందుగా వచ్చినందున దానిని పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట సమయంలో తేల్చాల్సి ఉన్నదని, ఆ సమయం ఎంత అన్నది ఆ కేసులోని అంశాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ‘ప్రస్తుత కేసులో అనర్హత పిటిషన్లపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సమయం, అసెంబ్లీ కాలపరిమితి వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సహేతుక సమయంలో స్పీకర్ తేల్చాలి’ అని తీర్పులో స్పష్టం చేసింది.
అనర్హత పిటిషన్ల విచారణ జరిగినప్పడు చట్టసభ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ఏమైనా తీవ్ర పరిణామాలు ఎదురైతేనే కోర్టుల జోక్యానికి వీలుంటుందని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ఆయా కేసుల్లో ఉదహరించిన రాజ్యాంగ అధికరణలను ప్రస్తావించింది. అధికరణాలు 136, 226, 227 కింద సుప్రీంకోర్టు, హైకోర్టుల జోక్యాన్ని పూర్తిగా నిషేధించలేదని కూడా చెప్పింది. రాజ్యాంగ ఉల్లంఘనలు, దురుద్దేశాలు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నపుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని హైకోర్టు తేల్చిచెప్పింది. రాజేంద్రసింగ్ రాణా కేసును ఉదహరించింది. పార్టీ చీలిక, విలీనం తేలేదాకా అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వాయిదా వేయడంపై సుప్రీంకోర్టు కిహిటో హోలోహాన్ కేసు ఆధారంగా జోక్యం చేసుకుని స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. అయితే, ఆ కేసులో అధికరణ 226 కింద న్యాయ సమీక్ష చేయవచ్చా? లేదా? అని తేల్చలేదని చెప్పింది. అనర్హత పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేశం మెగాచంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసులో నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై తేల్చాలని తీర్పు చెప్పిందని గుర్తు చేసింది. ఎస్ఏ సంపత్‌కుమార్ వర్సెస్ కాలె యాదయ్య కేసు ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నదని హైకోర్టు తెలిపింది. సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీం తీర్పుకు కట్టుబడి ఈ తీర్పు వెలువరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ న్యాయవాదుల వాదన
‘ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ మరో దుష్ట సంప్రదాయానికి తెరతీసి బీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒకరోజు కూడా అసెంబ్లీలో ఉండేందుకు వీల్లేదు. స్పీకర్ కాలయాపన చేస్తుంటే హైకోర్టు/సుప్రీంకోర్టు చూస్తూ ఉండకూడదు. అధికార పార్టీ తరఫున స్పీకర్ పదవిని చేపట్టిన వ్యక్తి అధికారపార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణకు ఆసక్తి చూపకపోతే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిందే. ప్రజా తీర్పును కాలరాసే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా పరిషరించాలి. లేనిపక్షంలో కోర్టులకు జోక్యం చేసుకునే అధికారం ఉంది. ఐదేండ్లపాటు నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తి అయిపోతుంది. కేశం మెగాచంద్రసింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ మధ్య జరిగిన కేసులో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అంటే మూడు నెలలని కూడా చెప్పింది. రాజ్యాంగంలోని 142వ అధికరణం మేరకు కోర్టులు ఉత్తర్వులు జారీచేయాలి. ఈ ఆదేశాలు స్పీకర్‌కు ఇవ్వరని, 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్‌గా స్పీకర్ వ్యవహరిస్తారు కాబట్టి చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలి’ అని బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, జే రామచందర్‌రావు వాదించారు.