రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు. కానీ ఇప్పుడు 7.4 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి ఈ జలాశయం నిరుడు కృత్రిమ సముద్రాన్ని తలపిస్తే నేడు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకొని వెలవెలబోతున్నది. ఇందులోకి కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తేనే ఇక్కడి నుంచి ఇటు హైదరాబాద్, అటు నల్లగొండ దాకా నీళ్లు చేరుతాయి.
హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా నీటి నిల్వలపై ప్రమాద ఘంటికలు మోగుతుండగా, తెలంగాణలో ఇప్పటికే జల సంక్షోభం తాండవిస్తున్నది. ప్రకృతి విపత్తు ఓ వైపు తరుముకొస్తుండగా, సర్కార్ అవగాహనారాహిత్యం, దుర్నీతితో అది మరింత ముంచుకొస్తున్నది. రాష్ట్రంలో సాధారణం కంటే కూడా 32శాతం తక్కువ నీటి నిల్వలు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అత్యంత కనిష్ఠ నిల్వలున్న రాష్ర్టాల జాబితాలోనే మన రాష్ట్రమే ముందున్నది.
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ ఆందోళనకర అంశం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు పదేండ్ల కనిష్ఠానికి తక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 166 జలాశయాల్లో వినియోగానికి అందుబాటులో ఉండే నీటి నిల్వలను సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
ఆ నీటి నిల్వలపై ప్రతివారం నివేదికలు విడుదల చేస్తుంది. ఆ 166 జలాశయాల మొత్తం నీటినిల్వ సామర్థ్యం 9103.34 టీఎంసీలు. అందులో వినియోగానికి అందుబాటులో (లైవ్స్టోరేజీ) ఉండే జలాలు 6481.68 టీఎంసీలు (71.20శాతం) మాత్రమే. ప్రస్తుత సమయానికి ఆయా రిజర్వాయర్లలో సాధారణంగా ఉండాల్సిన లైవ్స్టోరేజీ 1950.24 టీఎంసీలు. కానీ సీడబ్ల్యూసీ తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటినిల్వలు 2098.93 టీఎంసీలు (32.38శాతం) మాత్రమే. అంటే సాధారణ నిల్వల కంటే కేవలం 7శాతం మాత్రమే అధికంగా ఉన్నాయి.
అదీ కేవలం పశ్చిమ, మధ్య భారతంలోనే సాధారణ కంటే స్వల్ప అధికంగా నీటినిల్వలు ఉన్నాయి. కానీ మిగతా దేశమంతా సాధారణ నీటినిల్వ కంటే లోటు నిల్వలే నమోదయ్యాయి. నిరుడు ఇదే సమయంలో ఆయా జలాశయాల్లో లైవ్ స్టోరేజీ 3304.55 టీఎంసీలు. అంటే లైవ్స్టోరేజీలో 63.52శాతం నిల్వలు ఉన్నాయి. సాధారణ నిల్వలతో పోల్చినప్పుడు కూడా 107.62 శాతం నీటినిల్వలు అధికంగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది. సాధారణ నిల్వతో పోల్చినా స్వల్ప అధికంగా ఉన్నప్పటికీ, నిరుడితో పోల్చితే దేశవ్యాప్తంగా అన్నిచోట్ల నీటినిల్వలు కనిష్ఠంగానే ఉన్నాయి.

దేశ ఉత్తర ప్రాంతంలో 11 జలాశయాలు ఉన్నాయి. వాటి సాధారణ నీటినిల్వ శాతం 32.71శాతం కాగా, ప్రస్తుతం 31.23 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. తూర్పు భారతంలో మొత్తం 27 రిజర్వాయర్లు ఉండగా, ఈ సమయానికి వాటి సాధారణ నీటినిల్వ శాతం 27.22 శాతం ఉంటే, ప్రస్తుతం 27.45 శాతం ఉన్నాయి. కేవలం 0.4శాతం మాత్రమే నీటినిల్వలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ, మధ్య భారతంలోనూ అదే పరిస్థితి నెలకొన్నది.
సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం రిజర్వాయర్లలో ఉన్న నీటినిల్వల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కనిష్ఠంగా ఉన్నాయి. ఉమ్మడి రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ మినహాయించి రాష్ట్రంలో 8 ప్రధాన రిజర్వాయర్లు ఉన్నాయి. ఆయా రిజర్వాయర్ల ప్రస్తుత సమయానికి ఉండాల్సిన సాధారణ లైవ్ స్టోరేజీ 19.26 శాతం. కానీ ప్రస్తుతం 12.92 శాతం నీటినిల్వలే ఉన్నాయి. సాధారణం కంటే కూడా 32శాతం తక్కువ నీటి నిల్వలున్నాయి. నిరుడు ఇదే సమయానికి 30.18 శాతం నిల్వలు ఉండటం గమనార్హం. శ్రీశైలం, సాగర్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితిని బట్టి రాష్ట్రంలో నీటి సంక్షోభం ఆందోళన కలిగిస్తున్నది. పొరుగున ఉన్న ఏపీలో సాధారణం కంటే 21శాతం అధికంగా నీటినిల్వలు ఉండటం విశేషం. నిరుడు ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించి పెన్నా బేసిన్లో నిల్వ చేసుకొన్నది. ప్రస్తుతం ఆ నిల్వలే అక్కడ ఉండటం గమనార్హం.