సిద్దిపేట, జూన్ 15 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా అభివృద్ధి సాధించింది. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, కేసీఆర్ వచ్చాక మార్కెట్ వ్యవస్థ బలోపేతమైందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
నూతన సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం సిద్దిపేటలో జరుగగా.. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్, యాదవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..చాలా సంవత్సరాల నుంచి రాష్ట్రంలోనే సిద్దిపేట మార్కెట్ కమిటీకి మంచి పేరుందన్నారు. సిద్దిపేట మార్కెట్ కమిటీకి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా మచ్చ విజిత ఎన్నిక కావడం వారి అదృష్టమన్నారు.
అలాగే దేశంలోనే మార్కెట్ కమిటీల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సిద్దిపేటలో 5 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో మాత్రమే వ్యవసాయ గోదాములు ఉండేవన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సిద్దిపేట జిల్లాలో లక్షా ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాములు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం పూర్తయిందని వివరాలను వెల్లడించారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల నోటిలో నాలికలా రైతులందరితో కలిసిమెలిసి ఉంటూ వారికి కావాల్సిన సౌకర్యాలను మార్కెట్లో కల్పించాలన్నారు.
పీఏసీఎస్ చైర్మన్లతో కలిసి కల్లాల స్థాయిలో రైతులకు లబ్ధికలిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.