హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది రేవంత్ సర్కార్ తీరు. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ యథేచ్ఛగా నీళ్లను మళ్లించుకుపోతుంటే కండ్లుమూసుకున్నది. తాజాగా కరువు పరిస్థితులు సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి కోసం పొరుగు రాష్ర్టాలను కోరాలని ప్రభుత్వం ఇప్పుడు హడావుడి చేస్తున్నది. త్వరలోనే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు వెళ్లి విజ్ఞప్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది. కోయినా, నారాయణపూర్ జలాశయాల నుంచి నీటిని కోరాలని సూచించినట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం అంతంతమాత్రంగానే నమోదయ్యే అవకాశ ముందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వర్షాలూ ఇప్పటికీ జాడలేకపోగా, అటు కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, సాగర్ జలాశయాలు కూడా అడుగంటాయి.
ఒకవేళ కృష్ణాకు ఎగువ నుంచి వరదలు రాకపోతే రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నది. మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్ తాగునీటికి కటకట వచ్చే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో వచ్చిన వరదల్లో దిగువ రాష్ట్రాలకూ వాటా ప్రకారం జలాలను విడుదల చేయాలని ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకను కోరాలని సర్కార్ భావిస్తున్నది. ఇదిలా ఉంటే తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్లను అమర్చిన క్రమంలో కర్ణాటక ప్రభుత్వం 25న ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశానికి తెలంగాణ, ఏపీ సీఎంలను ఆహ్వానించింది. ఇందులో నీటి వినియోగం, వాటాలపై చర్చించాలని సమాలోచనలు చేస్తున్న సర్కార్.. ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది.
ఇప్పటివరకు కండ్లు మూసుకొని..
ఇదిలా ఉంటే కృష్ణా జలాలను ఏపీ యథేచ్ఛగా తరలించుకుపోతున్నా కండ్లు మూసుకున్న సర్కార్, ఇప్పుడు హడావుడి చేయడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. నిజానికి 2025-26 నీటి సంవత్సరంలో కృష్ణాలో భారీగా వరద నమోదయ్యింది. నవంబర్ నెలాఖరు వరకు కూడా ఎగువ నుంచి కృష్ణాలో వరద ప్రవాహాలు కొనసాగాయి. బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయి. కృష్ణాలో దాదాపు 2,400 టీఎంసీలు రాగా, అందులో ఇరు రాష్ర్టాలు కలిపి వాడుకొన్నవి 1,049.21టీఎంసీలు. ఇక కృష్ణా జలాలను తాత్కాలిక కోటా ప్రకారం 66:34శాతం నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలు వినియోగించుకోవాల్సి ఉన్నది. కానీ ఈ కోటాకు మించి రికార్డు స్థాయిలో 771.252 టీఎంసీల((74.27శాతం)ను ఈ ఏడాది ఏపీ తరలించుకుపోయింది. అయినా తెలంగాణ ఏమాత్రం అడ్డుచెప్పలేదు.
ఇక తెలంగాణ తన తాత్కాలిక కోటా 34శాతాన్ని కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఈ ఏడాది కేవలం 25.77శాతం అంటే 267.733 టీఎంసీల జలాలను మాత్రమే తెలంగాణ వినియోగించుకున్నది. ఇక సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువయ్యాయని, ప్రధానంగా హైదరాబాద్ సిటీ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉన్నది. అవిగాక వచ్చే సీజన్ వరకు తెలంగాణ తాగునీటి అవసరాలకు ఆధారపడాల్సింది ఆ రిజర్వాయర్లపైనేనని, తెలిసి ప్రశ్నించలేదు సరికదా అప్పటికే అందుబాటులో ఉన్న జలాల్లోనూ 10టీఎంసీలు కావాలని ఏపీ డిమాండ్ పెట్టడం, అందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతం మళ్లీ నీళ్ల కోసం పొరుగు రాష్ర్టాలను కోరాలని హడావుడి చేస్తుండటంపై ఇంజినీర్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటినుంచీ గుట్టుగా ఏపీకి సహకరించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.
కరెంటిస్తాం.. నీళ్లు ఇవ్వండి
కరెంటిస్తాం.. అందుకు బదులుగా నీళ్లు ఇవ్వాలని మహారాష్ట్ర సర్కార్‌ను కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. కోయినా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 67టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. అందులో 37టీఎంసీలను ఆ రాష్ట్రం తన సాగు, తాగునీటి అవసరాలకు కేటాయించుకోగా, మిగిలిన 30 టీఎంసీలను జలవిద్యుత్ కోసం వినియోగించుకోవాల్సి ఉంది. ఆ జలాలను దిగువకు విడుదల చేయాలని, ఆ మేరకు పరిహారం అందిస్తామని కోరాలని, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సాగునీటి శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తున్నది. జలవిద్యుత్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తామే సమకూర్చుతామని మహా సర్కార్‌ను కోరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర సర్కార్ ఒక టీఎంసీ నీటితో దాదాపు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, ఆ మేరకు లెక్కలు అంచనాలను సిద్ధం చేసినట్టు సమాచారం. సగటున యూనిట్ ఖర్చును రూ.4నుంచి రూ.8వరకు లెక్కగట్టి ఆయా స్లాబుల ప్రకారం లెక్కలు వేశారు. ఇక నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీలను కోరాలని భావిస్తున్నట్టు సమాచారం.