– భారత వరి పరిశోధన సంస్థ ప్రతినిధి కవిరాజు
బూర్గంపహాడ్, జూలై 22 : శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులతో సాగులో వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించుకోవచ్చు అని భారత వరి పరిశోధన సంస్థ ప్రతినిధి డాక్టర్ కవిరాజు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మట్టి పరీక్షలు, నేరుగా వరి విత్తే విధానంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. పంట సాగుకు ముందు తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకుంటే నేలలో ఉన్న పోషకాలు ఎంత మేరకు ఉన్నాయో తెలుసుకోవచ్చని, వాటి ఆధారంగా పంటకు అవసరమైన ఎరువులు సరైన మోతాదులో వినియోగిస్తే ఖర్చు తగ్గడంతో పాటు నేల సారవంతమై కాపాడబడుతుందని తెలిపారు.
అవసరానికి మించి ఎరువులు వాడటం వల్ల నేల నాణ్యత దెబ్బతింటుందని రైతులు గుర్తుంచుకోవాలన్నారు. నేరుగా వరి విత్తే విధానంపై వివరిస్తూ నీటి వినియోగం తగ్గుతుందని, కూలీలపై ఆధారపడాల్సిన పని ఉండదని, సాగు ఖర్చు కూడా తగ్గి ఎక్కువ లాభాలు సాధించవచ్చన్నారు. అనంతరం మండలంలోని రైతులకు మట్టి నమూనా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు, సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి బత్తిన వెంకటప్రసాద్, సంస్థ సిబ్బంది. రైతులు పాల్గొన్నారు