హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మైనార్టీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిషరించింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్న విధంగానే రాష్ట్రంలోని మైనార్టీలందరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం జారీ చేసింది. పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది.
బ్యాంకు లింకేజీ లేకుండానే..
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద అర్హులైన మైనార్టీలకు సబ్సిడీ రుణాలు అందజేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. రూ.లక్ష యూనిట్‌కు 80%, రూ.2 లక్షల యూనిట్‌కు 70% సబ్సిడీతో రుణాలను మంజూరు చేయాలని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందజేయాలని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. గత జనవరిలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టగా దాదాపు 2.16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అర్హులైన నిరుపేద మైనార్టీలందరికీ రూ.లక్ష సాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని బ్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన మైనార్టీలందరికీ ఏకమొత్తంగా గ్రాంట్‌గా అందజేయాలని మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. ఇప్పటికే అందిన దరఖాస్తుదారులకు ఇది వర్తింపజేయడంతోపాటు, కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు.
మైనార్టీల్లో చేతివృత్తిదారులకు ఎంతో ప్రయోజనం
రాష్ట్ర జనాభాలో ముస్లింలు 12.6%, క్రిస్టియన్లు 1.3%, బుద్ధిస్ట్లు 1%, సిక్కులు 0.04%, జైనులు 0.75% మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు చేతివృత్తులు, చిరువ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మైనార్టీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది.
మార్గదర్శకాలు
పేదరిక నిర్మూలనే లక్ష్యం: కేసీఆర్
కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆదివారం ఒక ప్రకటనలో పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధి తదితర రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదని తెలిపారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తున్నదని ఆనందం వ్యక్తంచేశారు. విభిన్న సంస్కృతులు, విభిన్న మత ఆచార, సంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమున తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా రూ.లక్ష సాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.