(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రసవం తర్వాత తల్లి పొత్తిళ్లలో అమ్మ ప్రేమను పొందాల్సిన పసిబిడ్డ రోడ్డు పక్కన ఉండే చెత్తబుట్టల్లో, చెట్ల గుట్టల్లో కనిపిస్తున్నది. ఎలుకలు, కుక్కలకు ఆహారం అవుతున్నది. ఇలాంటి పరిస్థితికి కారణాలు ఏమైనా కావొచ్చు. ఇటువంటి మనసును కరిగించే, కదిలించే, బాధపెట్టే హృదయ విదారకర దృశ్యాలు మన దేశంలో తరుచుగా కనిపిస్తుంటాయి. ఏటా 1,300 మందికి పైగా నవజాత శిశువులు రోడ్ల పక్కన పలు పరిస్థితుల్లో దొరుకుతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితులు దేశంలో నెలకొనడం ఓ విధంగా పాలకులకు సిగ్గుచేటు అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా గత నెల 15న ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో ఓ కాలువ పక్కన చెత్తబుట్టలో 5-6 రోజుల వయసు ఉండే నవజాత శిశువు ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. పసికందు వేళ్లు, పెదాలు ఎలుకలు కొరికి హృదయ విదారకంగా కనిపించింది. రక్తం కారుతున్న ఆ బిడ్డను స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దవాఖానలో చేర్చారు. కాస్త ఆలస్యం అయివుంటే ఇన్ఫెక్షన్తో శిశువు ప్రాణాలు పోయి ఉండేవని డాక్టర్లు చెప్పారు.
టాప్-5లో 4 బీజేపీ రాష్ర్టాలే..
నవజాత శిశువులు రోడ్ల పక్కన దొరుకుతున్న ఘటనలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కువగా చోటుచేసుకొంటున్నాయి. 2021లో 1,577 మంది నవజాత పిల్లలు రోడ్డు పక్కన దొరికారని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే మధ్యప్రదేశ్ ఇలాంటి సంఘటనలు అధికంగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2021లో అత్యధికంగా 222 మంది పసిపిల్లలు చెత్తబుట్టల్లో దొరికారు. గత ఐదేండ్ల గణాంకాలు చూస్తే టాప్-5లో బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. నగరాల పరంగా ఈ విషయంలో ఢిల్లీ టాప్‌లో ఉంది. ఢిల్లీ 94 మంది పసిబిల్లలు దొరికారు. ఆ తరువాత స్థానంలో పుణే, అహ్మదాబాద్, బెంగళూరు, సూరత్ ఉన్నాయి. 2015 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా 6,459 మంది నవజాత శిశువులు రోడ్డుపక్కన దొరుకగా, అత్యధికంగా 1,184 మంది మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్‌లో 1,168, రాజస్థాన్ లో 814 మంది ఉన్నారు.
అనాథలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
అనాథల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. అనాథల బాధ్యత ప్రభుత్వానిదేనని, వారికి అండగా ఉంటామని ప్రకటించింది. అనాథల ఆలనాపాలన, చదువుల బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథలు రోడ్లపై ఉండకూడదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడం తదితర చర్యలు తీసుకొన్నది. అనాథ పిల్లలకు ప్రత్యేకంగా 17 స్టేట్ హోమ్‌లు, 35 బాల సదన్లు ఏర్పాటు చేసింది. ముస్లిం పిల్లలకు ప్రత్యేక అనాథ శరణాలయాలు నడిపిస్తున్నది.