హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : వెయ్యి కోట్ల వేటకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సమిధలుగా మార్చుతున్నదా? కేరళ ఎన్నికలకు మూటల సర్దుబాటు కోసమే ఖమ్మంలో బుల్డోజర్లు కదంతొక్కాయా? ఇద్దరు మంత్రులు గీసిన స్కెచ్‌కు ముఖ్యనేత మద్దతు ఇచ్చారని, ఫలితంగానే వెలుగుమట్లలోని పేదల ఇండ్లు నేలమట్టమై, వారి జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఖమ్మం పట్టణంలోనే అత్యంత విలువైనవిగా మారిన భూదాన్ భూములపై ఓ మంత్రి కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ కన్నుపడిందని, మరో మంత్రికి చెందిన భూములు కూడా బినామీల పేరుతో సమీపంలోనే ఉన్నట్టు చెప్పుకొంటున్నారు. దీంతో పేదలను తరలిస్తే రూ.35 కోట్లు సర్దుతానని ఒక మంత్రి, ఖాళీచేసిన భూమిని తాను సూచించిన కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగిస్తామని హామీ ఇస్తే తక్షణమే రూ.100 కోట్లు సర్దుతానని మరో మంత్రి ముఖ్యనేతకు ఆఫర్ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. మొత్తంగా రూ.135 కోట్ల ఎరకు పడిపోయిన ముఖ్యనేత రాత్రికి రాత్రే పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం కొత్త కలెక్టరేట్ కట్టడం, నాగ్‌పూర్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంతో రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల గ్రామ శివారులోని 147, 148, 149 సర్వే నంబర్లలో ఉన్న 60 ఎకరాల భూ మి ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరం రూ.8 కోట్లు పలుకుతుందని అంచనా. ఆ ప్రాంతంలో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేసిన సమయంలోనే ఒక మంత్రి తనతోపాటు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో వెలుగుమట్లలో భూములు కొనుగోలు చేయించినట్టు తెలుస్తున్నది. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారని, అందుకే కలెక్టరేట్ ఎక్కడ కట్టబోతున్నారో ఆయనకు ముందుగానే తెలిసి, పెట్టుబడులు పెట్టించారని అంటున్నారు. దీంతో భూదాన్ భూములకు ఆనుకొని ఇరువైపులా సదరు మంత్రికి, ఆయన అనుచరులకు కలిపి 46 ఎకరాల భూమి ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు, గుడిసెలు ఉండటంతో ఆయన భూములకు ఆశించిన ధర రావడం లేదని ఆందోళన చెందినట్టు తెలిసింది. మరోవైపు 60 ఎకరాల భూదాన్ భూములపై మరో మంత్రి కుటుంబానికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీకి కన్నుపడ్డట్టు తెలిసింది. ఆ భూమిలో విల్లాలు కట్టి అమ్మితే రూపాయి పెట్టుబడికి రూ.100 లాభం వస్తుందని అంచనా వేసుకుంటున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వ భూమిలో ఉన్న గుడిసెలను తొలగించాలని మంత్రులు అనేకసార్లు ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. నిరుపేదలను ఖాళీ చేయించాలంటూ ఒక మంత్రి అనుచరులు కోర్టుల్లో కేసులు కూడా వేశారని చెప్తున్నారు.
వాస్తవానికి వెలుగుమట్లలో నిరుపేదలు 15 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని, శక్తిమేర ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారు. అలాంటి వారిని వెళ్లగొట్టడం అంత సులువు కాదని మంత్రులు తొలుత గ్రహించినట్టు తెలిసింది. బలప్రయోగం కంటే మంచితనంతోనే ఖాళీ చేయించాలని ప్రణాళికలు వేసినట్టు సమాచారం. ముందుగా వారి అనుచరులను పంపి గుడిసెలు ఖాళీ చేసిన వారికి ఇందిరమ్మ ఇండ్లతోపాటు, రూ.5 లక్షల ఆర్థిక సహకారం అందిస్తామని, ప్రభుత్వంతో చర్చించి మరికొంత సాయం ఇప్పిస్తామని బేరసారాలు నడిపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే 15 ఏండ్లుగా అక్కడే నివాసం ఉంటున్న కాలనీవాసులు తాము ఖాళీ చేయబోమంటూ తేల్చిచెప్పినట్టు సమాచారం.
ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ముఖ్యనేతతోపాటు ఇతర నేతలను ఢిల్లీకి పిలిచి కేరళ ఎన్నికలకు మూటలు సర్దే బాధ్యతను అప్పగించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందరికీ కలిపి రూ.1,000 కోట్ల భారం మోపారని, ఇందులో ఒక్కో మంత్రికి రూ.35 కోట్లు టార్గెట్ పెట్టారని కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై నిధుల సేకరణపై సహచర నేతలతో చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఒక మంత్రి కల్పించుకొని తన వద్ద నగదు లేదని, భూములు ఉన్నా వాటికి విలువ లేదని నిట్టూర్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భూదాన్ భూముల నుంచి గుడిసెలు తొలగిస్తే తన భూమికి ధర పలుకుతుందని, అలా చేస్తే రూ.35 కోట్లు సర్దడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో మరో మంత్రి స్పందిస్తూ.. భూదాన్ భూములను ఖాళీ చేయిస్తే 60 ఎకరాలు ఆధీనంలోకి వస్తాయని, దానిని తన కుటుంబానికి చెందిన ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించాలని, సరే అంటే తక్షణమే రూ.100 కోట్లు సర్దుబాటు చేస్తానని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. ఇద్దరు మంత్రులు కలిపి రూ.135 కోట్లు ఇస్తామని చెప్పడంతో ముఖ్యనేత మరో ఆలోచన లేకుండా వారి ప్లాన్‌కు సరే అన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే రాత్రికి రాత్రే పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపినట్టు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తేతెలంగాణ) : గాంధీ కుటుంబానికి 1,000 కోట్ల రూపాయలు పంపుతానని ప్రామిస్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..అందుకోసం అరాచకపర్వానికి తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదల ఇండ్లను కూల్చి, భూ ములు అమ్మకానికి పెట్టి నగదు సిద్ధం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇండ్లు కూల్చివేయడంతో శిథిలమై గాజాను తలపిస్తున్న డ్రోన్ చిత్రాన్ని శుక్రవారం ఎక్స్‌లో పోస్టు చేసి కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గాలను కండ్లకు కట్టారు. పేదల ఇండ్లు నేలమట్టం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి..హైదరాబాద్‌లో రెండో ప్యాలెస్ కట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. ఓవైపు బడుగుజీవుల నివాసాలను పెకిలించి వేస్తూ.. మరో వైపు తన కోట గోడలకు తొమ్మిది కోట్లు ఖర్చుచేస్తున్నారని మండిపడ్డారు. ‘ఆయన బాటలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడో ఇల్లు కట్టుకుంటున్నడు.. మరో కీలక మంత్రి పొంగులేటి పదో కంపెనీ పెట్టి కోట్లకొద్దీ కమీషన్లు దండుకుం టున్నడు..ఇది ప్రభుత్వం కాదు..ఫక్తు రియల్ ఎస్టేట్ కంపెనీ..వీళ్లు పక్కా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం, మంత్రులు విలాసవంతమైన జీవితాలు గడుపుతూ పేదల బతుకులను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు.