మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 27: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మికి తోడుగా తులం బంగారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, దీనిపై ఆడబిడ్డలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట తహసీల్ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లినా ఆడబిడ్డలు తులం బంగారం గురించి అడుగుతున్నట్లు తెలిపారు. ఈ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో పెండ్లయిన వెంటనే కల్యాణలక్ష్మి చెక్కులు అందేవని, ప్రస్తుతం పెండ్లయి పిల్లలు పుట్టిన తర్వాతనే కల్యాణలక్ష్మి అందుతున్నట్లు ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.
గ్రామాల అభివృద్ధికి అందుబాటులో ఉన్న ఈజీఎస్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు నీలిమా దవాఖాన ద్వారా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్, బీఆర్ఎస్ ధూళిమిట్ట, మద్దూరు మండల అధ్యక్షులు మంద యాదగిరి, మేక సంతోశ్‌కుమార్, సర్పంచ్‌లు గునుకుల లీలాజగన్మోహన్రెడ్డి, నలుగొప్పుల రేణుకారాములు, బర్మ రాజమల్లయ్య, చెట్కూరి కమలాకర్, ధరావత్ రూపేశ్, చొప్పరి రాములు, మారెడ్డి నారాయణరెడ్డి, దాసారం బాలకృష్ణ, పాల్త్య రమేశ్, మాజీ జడ్పీటీసీ నాచగోని పద్మావెంకట్గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, నాయకులు చొప్పరి సాగర్, సుందరగిరి పరుశరాములు, తాళ్లపల్లి భిక్షపతి, ఇమ్మడి సంజీవరెడ్డి, బడుగు సాయిలు, స్వర్గం లక్ష్మయ్య, బావండ్లపల్లి కృష్ణ, పోతరాజుల మధు తదితరులు పాల్గొన్నారు.