హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదిహేను సంవత్సరాలుగా లండన్‌లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను, అలాగే ఎన్నారైలు పార్టీకి అండగా ఉంటూ చేస్తున్న సేవలను నూతన సభ్యులందరికీ వివరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ నాయకత్వం ఎన్నారైలను ఎంతో ప్రోత్సహిస్తుందని, కష్టపడి పని చేస్తే గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో క్షేత్ర స్థాయిలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎంతో పోరాటం చేస్తుందని, వారికి సంఘీభావంగా పార్టీ కార్యకర్తలుగా రానున్న రోజులల్లో సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా, లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైలు భారీగాపార్టీలో చేరినట్టు మాజీ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పని చేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నామని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో యూకే ఉపాధ్యక్షుడు హరిబాబు నవపేట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో ఎన్నారై ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి ప్రదీప్‌గౌడ్ పులుసు, కమ్యూనిటీ ఆఫైర్స్ ఛైర్మన్ రమేష్ ఎసెంపల్లి వందన బీఆర్ఎస్ యూకే ప్రతినిధులు పాల్గొన్నారు.
