హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 21 ప్రైవేటు దవాఖానలను వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. డ్యూటీ సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 28 మంది ప్రభుత్వ వైద్యులకు నోటీసులు జారీచేశారు. ప్రైవేటు దవాఖానల్లో మూడు రోజులుగా వైద్య శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌తోపాటు అన్ని రకాల అనుమతులు, వసతులు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నాయి. సిబ్బంది వివరాలు, డాక్టర్ల విద్యార్హతల వంటి వివరాలన్నీ సమగ్రంగా పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న దవాఖానలను సీజ్ చేశారు. సరైన వసతులు లేని దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లోగా అన్ని జిల్లాల్లోని దవాఖానల్లో ప్రైవేటు ల్యాబ్‌లను తనిఖీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
సూర్యాపేటలోని గణపతి దవాఖానలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తూ అధికారులకు దొరికిపోయిన
నల్లగొండ జిల్లా కేతేపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్