హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న హోంగార్డులకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 1, 2వ తేదీల్లోనే పడే శాలరీలు.. కాంగ్రెస్ హ యాంలో 9వ తేదీ తర్వాత పడుతున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల మందికి పైగా హోంగార్డులు ఈ నెల వేత నం కోసం 19 రోజులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. జీతాలు ఆలస్యమవుతుండటంతో కుటుంబం గడవడం కష్టమవుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు.
ఈనెల 19వ మధ్యాహ్నం వేతనాలు అందగా ఇన్ని రోజులు ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోతున్నారు. సకాలంలో బ్యాంకుల్లో జీతాలు జమ కాక చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, ఈఎంఐ గడువు దాటి పెనాల్టీలు మీదపడడమే కాకుండా సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, అద్దెలు, పెట్రోల్ వంటి వాటికి డబ్బులు సర్దుకోవడం కష్టంగా మారిందని చెప్తున్నారు. దాదాపుగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాల్సిన తేదీ లు ప్రతినెలా 5లోపే ఉంటాయని, వేతనాలు ఆలస్యం కావడంతో పెనాల్టీలు అదనంగా పడుతున్నాయని వాపోతున్నారు.
చిన్న ఉద్యోగులకు ఇన్ని రోజులు ఆలస్యమా?
ఉద్యోగులకు ఠంచన్‌గా 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, చిన్న ఉద్యోగులమైన తమకు ఇన్ని రోజులు ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జీతాలు లేట్ కావడంతో సమయానికి తీరుస్తామో లేదోనన్న భయంతో ఎవరూ తమకు అప్పులు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. వినాయక చవితి సందర్భంగా ఇచ్చిన రూ.2,400 తప్ప శాలరీ అతీగతీ లేదని, కొందరు అధికారులు చిన్నచిన్న పొరపాట్లను పెద్దగా చూపుతూ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతున్నారని చెప్తున్నారు. కుటుంబ ఒత్తిళ్లతో విధులకు కాస్త ఆలస్యంగా వెళ్లినా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.