హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ వద్ద పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను తెలుసుకొనేందుకుగాను ఇసుక తొలగింపునకు అనుమతులివ్వాలని మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీబరాజ్)లో 7వ బ్లాక్‌లోని పలు పిల్లర్లు కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. ప్రధానంగా పిల్లర్ కింద అంతర్గతంగా కొనసాగిన నీటిప్రవాహం, తద్వారా ఇసుక, మట్టి కోతకు గురైన కారణంగా పిల్లర్ కుంగుబాటునకు గురయిందని ఇంజినీర్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాజెక్టును సందర్శించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఇంకా పలు ఇతర అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. బరాజ్‌ను పునాది వరకు తవ్వి తీసి పరీక్షిస్తే తప్ప వాస్తవకారణాలు ఏమిటనేది తెలియవని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కుంగుబాటునకు గురైన పిల్లర్లు మమారాష్ట్ర పరిధిలోని 7వ బ్లాక్‌లో ఉన్నందున అక్కడ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది.
రేపు మంత్రుల పర్యటన..
మేడిగడ్డ బరాజ్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు శుక్రవారం సందర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్ బయలుదేరి 11.30 గంటలకు మేడిగడ్డ బరాజ్‌కు చేరుకుంటారు. ఇంజినీరింగ్ అధికారులతో ప్రాజెక్టుపై, బరాజ్ కుంగుబాటుపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం బరాజ్‌ను సందర్శిస్తారు. మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి అన్నారం బరాజ్‌ను సందర్శించి హైదరాబాద్ చేరుకుంటారు.