Jupally Krishna Rao | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎక్కడా మద్యం కొరత లేదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 డిపోల్లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల నిల్వలు సరిపడా ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో కొత్త మద్యం బ్రాండ్లను కోరుకునే హక్కు ప్రజలకు ఉన్నదని అన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే.. దానికి ఇండెంట్ పెడతారని, వాటిని అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి, నాయకులకు ఉండదని తెలిపారు. త్వరలో కొత్త మద్యం బ్రాండ్లను తీసుకొస్తున్నారనే వార్తను ఆయన ఖండించారు. తమకు లేని ఆలోచనను పుట్టిస్తున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎవరూ కొత్త మద్యం బ్రాండ్ ప్రవేశపెడతామని దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పారు. మద్యం కొత్త పాలసీపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. బీర్లు దొరక్కపోవడానికి కంపెనీలకు పేమెంట్ లేటు కావడం కారణం కావొచ్చని, అందుకు గత ప్రభుత్వం ఇంకా డబ్బులు చెల్లింకపోవడమేనని అన్నారు. బీఆర్ఎస్ హాయంలోనే రూ. 2 వేల కోట్లకు పైగా ఎక్సైజ్‌శాఖకు బకాయిలు ఉన్నాయని చెప్పారు. మద్యాన్ని బ్లాక్ చేయకుండా అన్ని తయారీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టించినట్టు తెలిపారు. వాటిని ఎక్సైజ్‌శాఖ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామని చెప్పారు.
ఎన్నికల కోడ్ తర్వాత ఎక్సైజ్‌శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి జూపల్లి చెప్పారు. కొన్నేండ్లుగా తిష్టవేసిన వారిని కూడా బదిలీ చేస్తామని అన్నారు. ‘టానిక్’కు ఉన్న ట్యాక్స్ మాఫీని రద్దు చేశామని చెప్పారు. ప్రతిపక్షం తాగుడును పెంచమని అన్నట్టుగా మాట్లాడుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం పాలసీ ఏదైనా ఉంటే క్యాబినెట్లో నిర్ణయిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం పాలసీని తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పారు. తాను మంత్రిగా ఉండగా ఎలాంటి తప్పులు జరగవని అన్నారు.
తమ ప్రతిష్టను మకసబార్చే ప్రయత్నం జరుగుతున్నదని మంత్రి జూపల్లి అన్నారు. తప్పుడు వార్తలు రాయకుండా అడ్డుకొనేందుకు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై ఎక్సైజ్‌శాఖ ద్వారా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తప్పుడు కథనాలు రాయొద్దని మీడియాను హెచ్చరించారు. బీర్ల కొరతను తీర్చేందుకు, డిమాండ్‌కు తగ్గ ప్రొడక్షన్ కోసం ఫైల్ పంపితే.. ఎలక్షన్ కమిషన్ నిలిపివేసిందని చెప్పారు.