కూలుతున్న గూళ్లు.. నిలువనీడ కోల్పోతున్న ప్రజలు… అడవుల విలాపం.. ఆదివాసీల ఆక్రందనలు.. బడుగుజీవుల ఆర్తనాదాలు… మూగజీవాల హాహాకారాలు.. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నర విధ్వంస పాలనలో ఎక్కడ చూసినా ఇవే విషాదకరమైన దృశ్యాలు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ఏడాదిన్నరలో వేసిన పునాదుల జాడలు లేవు… కూలుతున్న బతుకులు తప్ప. ఒక్క ఇటుక పేర్చింది లేదు… ఇండ్లు కూల్చుడు తప్ప. తెలంగాణ ప్రజల ముఖాలపై చిరునవ్వులు లేవు… గుండెలపై బుల్డోజర్ గాయాలు తప్ప. పాలకులంటే దార్శనికతతో నిర్మాణాలు చేపట్టాలన్న సోయిలేని సర్కారు.. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపట్టాలనే ధ్యాసతోనే పనిచేస్తున్నదని ప్రజానీకం మండిపడుతున్నది. ఏడాదిన్నరగా సాగుతున్న ఈ విధ్వంసకాండను అవలోకనం చేసుకుంటే… కూలిన గోడలు… కన్నీటి జాడలే కనిపిస్తాయి.
– హైదరాబాద్, జులై 8 (నమస్తే తెలంగాణ)
పాలన పగబడితే.. సర్కారే కర్కశంగా ఎగబడితే.. ఆ పడగనీడలో పేదల బతుకు ఎంత దుర్భరంగా మారుతుందనే దానికి ఉదాహరణ ఈ దృశ్యం. హైదరాబాద్ గుండెలపై హైడ్రా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కారు.. బస్తీలను చిదిమి, బడుగు గుడిసెల్ని కూల్చి ధ్వంసరచన కొనసాగిస్తున్నది. పెద్దల ఆకాశహర్మ్యాల వైపు కన్నెత్తయినా చూడని బుల్డోజర్.. పేదల నీడపై పిడుగులా విరుచుకుపడుతున్నది. దాని పదఘట్టనల కింద పడి నలుగుతున్న దీనులెందరో! కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, న్యాయమూర్తులు తప్పుపడుతున్నా.. ఇనుప కోరలతో యంత్రభూతం చేస్తున్న వికృత వికటాట్టహాసం ఇప్పుడు తెలంగాణలో నిత్యదృశ్యం. మంగళవారం ఉదయం జేసీబీల చప్పుళ్లతో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందనగర్ నిద్రలేచింది. ఆధారాలున్నాయని మొరపెట్టుకుంటున్నా వినకుండా.. అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలను మొదలు పెట్టింది. తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న రేవంత్ సర్కారును తిట్టిపోసిన ఓ మహిళ.. బుల్డోజర్ను ముందుకు పోనివ్వకుండా ఇలా నేలపై పడుకున్నది. ‘మమ్మల్ని తొక్కుకుంటూ పోతారా?’ అంటూ నిలదీసింది. కానీ, పోలీసులు స్థానికులను ఈడ్చిపారేస్తుంటే.. జేసీబీలు కూల్చివేతల్ని ముగించాయి.
వేములవాడలో ప్రభుత్వం రోడ్ల విస్తరణ పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతున్నది. ఆలయ సమీపంలో దశాబ్దాలుగా చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి దుకాణాలు నేలమట్టం చేసి రోడ్డునపడేస్తున్నది. పరిహారం ఇవ్వకుండానే ప్రజల బతుకులతో చెలగాటమాడుతున్నది. గూడు చెదిరిపోయిన జనం గుండెలవిసేలా రోదిస్తున్నారు. రోడ్డును 80 అడుగులకు విస్తరించాలని భావిస్తున్న అధికారులు 243 మంది నిర్వాసితులను గుర్తించారు. కానీ వీరిలో చాలామంది ఉన్న ఇల్లు కోల్పోయి, సర్కారు నుంచి పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అడవి బిడ్డల వేదన అరణ్య రోదనగా మారింది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి పాతతండాలో పోడుభూములపైకి సర్కారు బుల్డోజర్లను పంపింది. జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతులు విలపించారు. మహిళారైతులను సైతం పోలీసులు ఈడ్చిపడేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కంచగచ్చిబౌలిలోని అడవిని విధ్వంసం చేసింది. సుమారు 400 ఎకరాలను ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు కంకణం కట్టుకున్నది. ఇందుకోసం రాత్రికి రాత్రే వందలాది బుల్డోజర్లను దింపి, 100 ఎకరాల అడవిని నేలమట్టం చేసింది. పర్యావరణ విధ్వంసానికి
పాల్పడింది. వన్యప్రాణులకు ఆవాసాలను దూరం చేసింది.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని అరుంధతినగర్‌లో కూలిపని చేసుకుని బతికే బడుగుజీవులపై హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు క్రూరత్వం కనబర్చారు. కనికరం కూడా లేకుండా రేకుల షెడ్డుల్లో నివసిస్తున్న వారిని బయటకు లాక్కొచ్చి, బుల్డోజర్లతో ఆవాసాలను నేలమట్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో పేదలను బతకనియ్యరా అంటూ జనం ఆగ్రహం వ్యక్తంచేశారు.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని ఓల్డ్ కోర్ట్ బిల్డింగ్‌లో రెండు దశాబ్దాలుగా కమర్షియల్ కాంప్లెక్స్ నడుస్తున్నది. ఇక్కడ ప్రధానంగా డాక్యుమెంటేషన్, ప్రింటింగ్ వర్క్స్ నడుస్తాయి. కానీ ప్రభుత్వం ఆ భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేసింది. హెచ్ఎండీఏ అధికారులు సరైన సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై దుకాణదారులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరు సరికాదని విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ సర్కారుకు పేదలు, బడుగు బలహీనవర్గాలపైనే కాదు.. ఆఖరికి దివ్యాంగుల పైనా కనికరం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్ జిల్లా ఆదర్శనగర్‌లో అధికారులు పలు ఇండ్లను నేలమట్టం చేశారు. ఇందులో దివ్యాంగుల ఆశ్రమం కూడా ఉంది. ప్రభుత్వ చర్యతో పేదలు, అభాగ్యులు రోడ్డునపడ్డారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లిలోని నల్లచెరువు సమీపంలో పట్టాలు కలిగిన భూముల్లో ఏర్పాటు చేసిన రేకులషెడ్లపైకి కూడా ప్రభుత్వం హైడ్రాను ప్రయోగించింది. ఆస్తి పన్ను చెల్లిస్తూ.. నల్లా, విద్యుత్తు కనెక్షన్ కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం అమానవీయంగా కూల్చివేతలకు పాల్పడటం దారుణమని బాధితులు విలపించారు.
ఖమ్మం మున్సిపాలిటీ పరధిలో పేదలు ఏర్పాటు చేసుకున్న రేకుల షెడ్లపైకి సర్కారు బుల్డోజర్లను పంపింది. బతుకుదెరువును దూరం చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతున్నదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండలో జాతీయ రహదారికి బైపాస్ నిర్మాణంలో భాగంగా పత్యామ్నాయం చూపకుండా ఇండ్లు కూల్చడానికి వీల్లేదని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించి… అర్ధరాత్రి ఇండ్ల కూల్చివేత చేపట్టింది. తమ ఇండ్లను కూల్చొద్దని వేడుకుంటున్న పెద్దలతో పాటు చిన్నారులను కూడా పోలీసులు ఇలా ఈడ్చివేశారు.
పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ముతో సొంతింటి కల నెరవేర్చుకున్న మధ్యతరగతి ప్రజల కలలను కూడా కాంగ్రెస్ సర్కారు కాలరాస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడలో సత్యనారాయణ అనే ఉద్యోగి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకోగా.. గృహప్రవేశమైన ఆరు రోజులకే హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఏండ్ల కల నేలమట్టమైంది.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దేవేంద్రనగర్లో బడుగు జీవుల బతుకులను హైడ్రా కుప్పకూల్చింది. చిన్నచిన్న రేకులషెడ్లు, అట్ట గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారిని తరిమేసింది. కొంత సమయం ఇస్తే ఖాళీ చేస్తామన్నా వినిపించుకోకుండా కర్కశంగా వ్యవహరించింది. కనీస మానవత్వం చూపకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
మహిళాశక్తి, ఇందిరమ్మ రాజ్యం నినాదాలు ఇస్తున్న కాంగ్రెస్ సర్కారు.. స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న మహిళను రోడ్డున పడేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ చిలుకానగర్‌లోని రాధికాగౌడ్కు చెందిన పాలకేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆమె కుటుంబానికి బతుకుదెరువును దూరం చేశారు.
రేవంత్‌రెడ్డి సర్కారు బుల్డోజర్లను ప్రయోగించడంలో కనీస కనికరం చూపడంలేదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో చిన్నపిల్లల దవాఖానను కూడా హైడ్రా నిబంధనల పేరిట కూల్చివేసింది. ఈ ప్రాంతాలు గ్రామాలుగా ఉన్నప్పుడు వేసిన వెంచర్లలో భవనాలను నిర్మించారు. కూల్చివేతలకు కోర్టు స్టే ఉందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.