హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ)/ దహెగాం/ పెంచికల్పేట్/ చింతలమానేపల్లి: తునికాకు (బీడీ ఆకు) సేకరణ రేటు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జీవో నంబర్ 15ను జారీచేసింది. కట్టకు రూ.2.05గా ఉన్న తునికాకు సేకరణ ధరను రూ.3కి పెంచింది. 2023 వేసవి సీజన్ నుంచే కొత్త ధరలను వర్తింపచేయనున్నది. సేకరించిన తునికాకును విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని తిరిగి సేకరణదారులకే చెల్లించాలని నిర్ణయించింది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో తునికాకు సేకరణ.. గిరిజన, గిరిజనేతర కూలీలకు వేసవిలో మంచి ఉపాధిగా మారనున్నది. తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ నెట్ షేర్ (బోనస్)ను కూడా చెల్లిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.200 కోట్లను బోనస్‌ను చెల్లించే కార్యక్రమాన్ని సోమవారం అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని కర్జెల్లి అటవీరేంజ్ చింతలమానేపల్లిలో ప్రారంభించారు.
ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కుతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో తునికాకు కూలీలకు రూ. 31.58 కోట్లు బోనస్ చెల్లించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 63,573 మంది లబ్ధిదారులకు రూ. 31.58 కోట్లు, సిర్పూర్ నియోజకవర్గంలో 48,418 మంది లబ్ధిదారులకు రూ.26.98 కోట్లు చెల్లించారు. మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని మూసివేసే ప్రమాదం ఉన్నందున పేదలు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తునికాకు కట్ట సేకరణ ధర పెంచారని చెప్పా రు. పోడు భూముల సర్వే కొనసాగుతున్నదని, వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడించారు.