హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ కేటాయింపులపై వైద్యశాఖ వింత వైఖరి అవలంబిస్తున్నది. ప్రచారానికి.. కేటాయింపులకు సంబంధం లేదని వైద్యవర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ ఏడాది ఆరోగ్యశ్రీలో కొత్త చికిత్సలు చేర్చామని, ప్యాకేజీల ధరలు సవరించామని వైద్యారోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది. దీంతో అదనంగా ప్రభుత్వంపై రూ.487 కోట్ల భారం పడుతుందని గొప్పలు చెప్పుకున్నది. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి పూర్తిగా చేతులెత్తేసింది. 2023-24లో ఆరోగ్యశ్రీకి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.865 కోట్లు కేటాయించింది. ప్యాకేజీల సవరణతో ఈ ఏడాది 54 శాతం బడ్జెట్ పెరుగుతుందని ఈ నెల 22న వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ లెక్కన ఈ ఏడాది రూ.1,350 కోట్ల బడ్జెట్ కేటాయిస్తారని వైద్యనిపుణులు ఆశించారు.
కానీ.. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.957 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నది. దీంతో ఆర్భాటపు ప్రకటనలే తప్ప నిధుల కేటాయింపు ఏదీ? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది అసలు ప్యాకేజీల సవరణ అమలు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి 2014 నుంచి ఏటికేడు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
2014-15లో 1.17 లక్షల మందికి 1.96 లక్షల చికిత్సలు చేయగా.. 2023-24 నాటికి సుమారు 3 లక్షల మందికి దాదాపు 5 లక్షల చికిత్సలు నిర్వహించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది అదనంగా 163 వ్యాధులను జతచేసిన నేపథ్యంలో.. బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరించడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.