హైదరాబాద్, అక్టోబర్11(నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్టే ఆర్డర్‌కు సంబంధించి హైకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సహచర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తదితరులతో అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జారీచేసిన జీవో 9ని, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం సూచించినట్టు సమాచారం. దీనిపై వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరాలని న్యాయవాదులకు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, తొందరపడితే మనం కోరుకున్నట్టు ఉత్తర్వులు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పినట్టు సమాచారం. అయినా వెంటనే సుప్రీంకోర్టు తలుపు తట్టాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు చర్చ జరుగుతున్నది. ఈ హడావుడి వెనుక వేరే కారణం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కాల్సిన 42 శాతం బీసీ రిజరేషన్లను సాధించకుండా, కోర్టు బోనులోకి ఎక్కించి చిక్కుల్లో పడేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు దానిని పీటముడిగా మార్చాలని భావిస్తున్నట్టు మండిపడుతున్నారు.
స్టే ఉత్తర్వుల మేరకు హైకోర్టు శుక్రవారం రాత్రి విడుదల చేసిన మార్గదర్శకాలతో ప్రభుత్వ పెద్దలకు నిద్ర పట్టలేదని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మార్గదర్శకాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నామని, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేయలేదని స్పష్టంచేసింది. పెంచిన బీసీ రిజర్వేషన్లతో కాకుండా పాత పద్ధతిలో రిజర్వేషన్లు అమలుచేసి ఎన్నికలకు వెళ్తామంటే తమకు అభ్యంతరం లేదని ధర్మాసనం తెలిపింది. రిజర్వేషన్ల సవరింపును ప్రకటించి ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వం అనివార్యంగా కేసీఆర్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన పంచాయతీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచే సీఎం, ఇతర ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనలో పడ్డట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు చేతికి అందినప్పటి నుంచి సన్నిహితులతో చర్చలు, ఫోన్ కాల్ మంతనాలతోనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని సమాచారం. పాత రిజర్వేషన్లతో వెళ్తే ఇంతకాలం నడిపిన 42 శాతం రిజర్వేషన్ల షో అట్టర్‌ప్లాఫ్ అవడమే కాకుండా, బీసీలు తిరగబడే ప్రమాదం ఉన్నదని భయపడుతున్నారట. అంతేకాదు.. ఎన్ని కుప్పిగంతులు వేస్తున్నా కేసీఆర్ ఆనవాళ్లే ఎదురుపడుతున్నాయని తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని బీరాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిన సంగతి తెలిసిందే. అయినా కాలగమనంలో కేసీఆర్ రూపొందించిన చట్టాలను, అమలు చేసిన పథకాలను, అవే ప్రాజెక్టులను కొనసాగించాల్సి వస్తున్నదని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతున్నది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ రేవంత్‌రెడ్డికి ఇదే అనుభవం ఎదురైందని చెప్తున్నారు. అందుకే కేసీఆర్ ఆనవాళ్లు చేరిపే కుట్రకు బీసీలను బలిపెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నిర్వహించిన అత్యవసర జూమ్ మీటింగ్‌లో ఆసక్తికర చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, రిజర్వేషన్లను సవరించి పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పిందని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు సమాచారం. గతనెల 26న ప్రభుత్వం జారీచేసిన బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో 9, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ జారీచేసిన జీవోలు 41, 42 అమలును నిలిపివేస్తూ స్టే జారీ చేసిందని గుర్తుచేశారట. ఈ తీర్పునకు సుప్రీంకోర్టు మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని, మనం కోరుకున్న తరహాలో సుప్రీం నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఎంతమాత్రమూ ఉండదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. ‘బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి ఉండటమా? లేదా పార్టీపరంగా 42శాతం టికెట్లు ఇవ్వడమా? అనే రెండు అంశాలపై ప్రభుత్వ నిర్ణయం ఉండాలని గతంలో అనుకున్నాం కదా. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆప్షన్ ఎందుకొచ్చింది?’ అని బీసీ మంత్రి ఒకరు సీఎంను అడిగినట్టు తెలిసింది.
రిజర్వేషన్ల జీవో 9ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రెడ్డి సంఘం నాయకులు బీ మాధవరెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే, తమ వాదనలు కూడా వినాలని, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లడం అసాధ్యమని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు తెలిసింది. 42శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని మొదటి నుంచీ చెప్తున్నామని గుర్తు చేశారట. ఇన్నిరోజులు ఈ అంశం బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, మేధావి వర్గాల మధ్యే చర్చల రూపంలో ఉండేదని, జీవో 9 విడుదల, ఎన్నికలకు షెడ్యూల్ విడుదలతో ప్రజల్లోకి చేరిపోయిందని సీఎం వివరించినట్టు సమాచారం. హైకోర్టు స్టే నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై చర్చ మరింత విస్తృతమైందని, ఈ సమయంలో పాత పద్ధతిలో వెళ్తే రివర్స్ అయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారట. ఓవైపు హామీని నిలబెట్టుకోలేదన్న అపవాదుతోపాటు, కేసీఆర్ తెచ్చిన రిజర్వేషన్లు అమలు చేశారనే ప్రచారం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మేలు చేస్తుందని అన్నట్టు తెలిసింది. అంతేగాకుండా కేసీఆర్ ఆనవాళ్లే వద్దనుకుంటుంటే మళ్లీ ఆయన తెచ్చిన రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్తే ముఖం ఎక్కడ పెట్టుకుందామని ఆవేదన వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయ నిపుణులు ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైన తర్వాత హైకోర్టు జోక్యం చేసుకున్నదని, ఇది సరికాదనే అంశంతో సుప్రీంకోర్టులో వాదించాలనే సూచన చేసినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6 శాతం ఉన్నందున 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకొచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే కొంత మేరకు ప్రయోజనం ఉండవచ్చనే సలహా ఇచ్చినట్టు సమాచారం.