గజ్వేల్, ఏప్రిల్ 10: యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొస్తే.. ఆ బిల్లును కూడా గవర్నర్ ఏడు నెలలుగా ఆపారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఏడు నెలల తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో విద్యార్థులకు చదువులు చెప్పేందుకు ప్రొఫెసర్లు ఉండొద్దా? అని నిలదీశారు. బీజేపీ సర్కారు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. అసెంబ్లీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులకు కోర్టుకు పోతేగానీ మోక్షం లభించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను కేంద్రం తన రాజకీయాలకు వాడుకొంటున్నదని, బిల్లులను గవర్నర్ ఏడు నెలలుగా పెండింగ్‌లో పెట్టడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమేనని మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం మంగోల్ వద్ద మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్లాంట్ ట్రయల్న్ చేసిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘ఈరోజు చాలా బాధతో మాట్లాడుతున్నా. అసెంబ్లీలో పాసైన బిల్లు తెల్లారేసరికి గవర్నర్ ఆమోదిస్తారు. ఎక్కువకు ఎక్కువగా మూడు, నాలుగు రోజుల సమయం తీసుకొంటారు. కానీ, ఆరేడు నెలలుగా గవర్నర్ దగ్గర బిల్లులు ఆగుతున్నాయ్. ఇన్ని రోజులపాటు బిల్లులు ఆగాయంటే ఆమెకు డైరెక్షన్ ఎవరిస్తున్నరో.. ఇది నిజంగా దురదృష్టకరం. కోర్టులో కేసులు వేస్తేగానీ బిల్లు పాస్‌కాని పరిస్థితి వచ్చింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడిగి అడిగి విసిగి వేసారిందని, అందుకే కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. రాష్ట్ర సర్కారు పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో వేసిన కేసు హియరింగ్‌కు రావడంతో గవర్నర్ హడావిడిగా మూడు బిల్లులు పాస్చేశారని చెప్పారు. రెండు బిల్లులు రాష్ట్రపతికి పంపి, మరో రెండు బిల్లులు ప్రభుత్వానికి తిప్పి పంపారని, ఈ రకంగా తామేదో చేస్తున్నామని చేప్పే ప్రయత్నం చేశారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కలుషితం చేసి, రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ఫారెస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొంటే, ఆ బిల్లును కూడా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. ఇలాంటి యూనివర్సిటీలను తక్షణమే ఆమోదిస్తే చాలామంది విద్యార్థులకు న్యాయం జరిగేదని, గవర్నర్ విద్యార్థుల జీవితాలతో అడుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీహార్‌లో 1961లోనే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటైందని, తెలంగాణలో ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు అద్భుతంగా పనిచేస్తున్నదని, అయినా కేంద్రం అన్నింటా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఏపీ విభజన చట్టం కింద తెలంగాణకు మూడేండ్ల నుంచి రావాల్సిన రూ.1300 కోట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. బోర్లకాడ కరెంట్ మీటర్లు పెట్టకపోతే కేంద్ర సర్కారు రూ.30 వేల కోట్లు నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ సమాజం క్షమించబోదని హెచ్చరించారు.
తెలంగాణకు తీరని అన్యాయం
తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర సర్కారు తీరని అన్యాయం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ పథకాన్ని మెచ్చి తెలంగాణకు రూ.13 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కేంద్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. గోవా, గుజరాత్‌కు సహకారం అందించిన కేంద్రం.. తెలంగాణకు ఎందుకు సహకారం అందించడం లేదని ప్రశ్నించారు. అవార్డులు ఇవ్వడం.. తియ్యటి మాటలు మాట్లాడటం.. ప్రశంసలు తప్ప తెలంగాణకు బీజేపీ సర్కారు ఏమీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.