హైదరాబాద్ : చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) తెలిపారు . ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ 93 వ జయంతి సందర్భంగా సప్తపది చిత్ర కథానాయిక సబిత ను ప్రముఖ సాంస్కృతిక కళా సంస్థ ఆకృతి నిర్వహణలో శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.
మంత్రి మాట్లాడుతూ కె విశ్వనాథ్ తెలుగు చలచిత్ర దశ దిశలను మహోన్నత శిఖరాల కు చేర్చిన మహనీయుడు అన్నారు. ఎందరో కళాకారులు ఆయన చిత్రంలో ఒక్కసారైనా నటించాలని కలలు కంటారని తెలిపారు. ఒక్క చిత్రంలో నటించినా సప్తపది సబిత కు విశ్వనాథ్ (K .Vishwanath)తో పనిచేసిన మధుర స్మృతులు ఎల్లకాలం గుర్తుండి పోతాయన్నారు.
తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మా చలం మాట్లాడుతూ స్వతహాగా మంచి నర్తకి అయిన సబిత సప్తపది చిత్రంలో తమ సహజ నటన ను ప్రదర్శించారని కొనియాడారు. శంకరా భరణం, సప్తపది చిత్రాల తరువాత సంప్రదాయ కలలైన నృత్యం, సంగీతాన్ని తమ వృత్తిగా స్వీకరించి ముందుకు వెళుతున్నారు. ఆకృతి సుధాకర్, కళాభిమానులు పాల్గొన్నారు.