CCE | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉన్నట్టా? లేనట్టా? అంటే అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ఇంతకీ ఈ విధానం రాష్ట్రంలో అమలు చేస్తారా? లేక ముగింపు పలుకుతారా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వడంలేదు. పదో తరగతిలో ఈ విద్యాసంవత్సరం గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేశారు. ఈ స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి గ్రేడింగ్ విధానానికి సీసీఈయే మూలం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గ్రేడింగ్ విధానాన్ని మాత్రమే రద్దు చేసినట్టు ప్రకటించింది. సీసీఈ విధానం రద్దు అయినట్టు గానీ.. కొనసాగిస్తున్నట్టు గానీ చెప్పలేదు. ఇప్పటికైతే ఈ ఏడాది గడిచిపోయింది. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. ఇప్పటికిప్పుడు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటేనే జూన్ వరకు సన్నద్ధం కావొచ్చు. విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. స్పష్టత ఇవ్వడంలేదు. పైగా సాగదీతలు, సస్పెన్స్లతో కాలం వెల్లదీస్తున్నది.
విద్యాహక్కు చట్టం ప్రకారం 2012-13 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని(సీసీఈ) అమలు చేస్తున్నారు. మార్కులు ముఖ్యం కాదు.. బాలల సర్వతోముఖాభివృద్ధి ముఖ్యమని విద్యాశాఖ ఈ విధానానికి జైకొట్టింది. బడుల్లో ఆటలు, నైతిక విలువలు, పని అనుభవం, కళలకు ప్రాధాన్యం ఇచ్చింది. త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల స్థానంలో నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనాలు అమల్లోకి వచ్చాయి. పన్నెండేండ్ల తర్వాత పదో తరగతిలో ఈ సంవత్సరం గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేశారు. ఇంటర్నల్ మార్కులుండవని ప్రకటించారు. 80 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని విద్యాసంవత్సరం మధ్యలో ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. అప్పటికే ఫార్మేటివ్ పరీక్షలు, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. చివరికి తప్పిదాన్ని గ్రహించి ఈ ఒక్క ఏడాది ఇంటర్నల్స్ను కొనసాగిస్తున్నారు. 1-9 తరగతుల విద్యార్థులకు గ్రేడింగ్ పద్ధతిలోనే మార్కులేస్తున్నారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.