Telangana Decade Celebrations | తెలంగాణలో వైద్యారోగ్యం ఎట్లున్నది? బడ్జెట్ లెక్కల్లో చెప్పాలంటే.. 12 వేల కోట్ల కేటాయింపులే చెప్తాయి. పథకాల పేర్లలో చెప్పాలంటే..కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పేర్లు చాలు. స్కానింగ్ పరిభాషలో చెప్పాలంటే.. టిఫా, ఎన్సీడీ, టీ-డయాగ్నస్టిక్స్‌కు తెలుసు. దవాఖానల రూపంలో చెప్పాలంటే.. బస్తీ దవాఖానల్లో కనిపిస్తున్నది! సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు చూపిస్తున్నయి!! మరీ అంతగా కావాలంటే.. మెడికల్ కాలేజీలను అడగొచ్చు డయాలసిస్ రోగులను అడగొచ్చు!! కంటివెలుగు లబ్ధిదారులనూ అడగొచ్చు!!!
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎదిగింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్యక్రమాలు ప్రజావైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. ఫలితంగా ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకున్న రోజుల నుంచి.. నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అని సంబురంగా వెళ్లే రోజులు వచ్చాయి. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అనేక రికార్డులను, కేంద్ర ప్రభుత్వం నుంచి పదుల సంఖ్యలో అవార్డులను, ప్రశంసలను దక్కించుకున్నది. వైద్యారోగ్యశాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్యరంగ సంస్కరణలు మరింత ఊపందుకున్నాయి. రాకెట్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటుండగా, అదే స్థాయిలో పనులు పరుగులు పెడుతున్నాయి. రికార్డు సమయంలో అందుబాటులోకి వస్తున్నాయి.
నిమ్స్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,571 కోట్లు ఖర్చు చేస్తున్నది. భవిష్యత్తులో పెరుగనున్న రద్దీ, విస్తృతం కానున్న స్పెషాలిటీ సేవలను దృష్టిలో పెట్టుకొని ఏకంగా ఎనిమిది అంతస్థుల్లో ఓపీ బ్లాక్‌ను నిర్మించనున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం 8 అంతస్థులతో బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. ఇన్ పేషెంట్ల కోసం 13 అంతస్థులతో మరో బ్లాక్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. 2,000 పడకలు అందుబాటులోకి వస్తుండగా అన్నింటికీ ఆక్సిజన్ సరఫరా ఉంటుంది.
సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శ్రీకారం చుట్టారు. అల్వాల్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు వరంగల్ హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నారు. నిమ్స్‌లో అదనంగా 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను నిర్మిస్తున్నారు.
1) అంచనాలకు మించి రిజిస్ట్రేషన్లు
కేసీఆర్ కిట్ పొందాలంటే కచ్చితంగా గర్భిణులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో రాష్ట్రంలో అంచనాలకు మించి గర్భిణుల నమోదు జరిగింది. హెచ్ఎంఐఎస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఏఎన్సీ 2021-22లో 108.39 శాతంగా నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పడే నాటికి ఏఎన్సీ రిజిస్ట్రేషన్లు దాదాపు 70 శాతం మాత్రమే ఉండేవి.
2) ఏఎన్సీ చెకప్స్లోనూ ఆదర్శం
కేసీఆర్ కిట్‌లో.. గర్భిణిగా నమోదై, కనీసం రెండుసార్లు ఏఎన్సీ చెకప్ చేయించుకున్న తర్వాతే మొదటి విడుత నగదు సాయం రూ.3 వేలు అందించాలని నిబంధన ఉన్నది. దీంతో గర్భిణులకు ఏఎన్సీ చెకప్స్ నిర్వహించడంలోనూ తెలంగాణ ముందువరుసలో ఉన్నది. గర్భిణులకు టీటీ, టీటీ బూస్టర్ వేయడంలోనూ తెలంగాణ 91 శాతంతో టాప్ రాష్ర్టాల్లో నిలిచింది.
3) 100 శాతం సురక్షిత ప్రసవాలు
రాష్ట్రంలో ప్రసవాలు వంద శాతం దవాఖానల్లోనే జరుగుతున్నాయి. తద్వారా దేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 2015లో 33 శాతంగా ఉండేవి. అంతేకాదు.. 2022లో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 61 శాతం నమోదయ్యాయి. ఇది ప్రైవేట్ కన్నా 20 శాతం అధికం.
4) అతితక్కువ అబార్షన్లు
కేసీఆర్ కిట్‌లో భాగంగా గర్భిణుల నమోదు అనంతరం వైద్య సిబ్బంది ఏఎన్సీ చెకప్‌ల ద్వారా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన మందులు అందజేస్తున్నారు. పౌష్టికాహారం, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఫలితంగా అతి తక్కువ అబార్షన్లు నమోదవుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
5) తగ్గిన మాతాశిశు మరణాలు
మాతృమరణాల (ఎంఎంఆర్) తగ్గింపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. మరణాల తగ్గుదల రేటులో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (ఎస్ఆర్ఎస్) నివేదిక ప్రకారం ఎంఎంఆర్ 43కు తగ్గింది.
6) ఆరోగ్యంగా శిశువులు
తెలంగాణలో 93.8 శాతం మంది పిల్లలు సరైన బరువుతో పుడుతున్నట్టు హెచ్ఎంఐఎస్ నివేదిక తెలిపింది. 81 శాతం మంది పిల్లలకు ముర్రుపాలు అందుతున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో 100 శాతం పిల్లలకు టీకాలు వేసినట్టు కేంద్రం అనేకసార్లు స్పష్టం చేసింది.
గర్భిణులు సురక్షితంగా ఇంటి నుంచి దవాఖానలకు వెళ్లి, పరీక్షలు చేయించుకొని తిరిగి రావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమ్మ ఒడి వాహనాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం 300 వాహనాలు ఉన్నాయి. ఇవి రోజూ వేల మంది గర్భిణులకు సురక్షిత ప్రయాణం కల్పిస్తూ, రవాణా ఖర్చును తగ్గిస్తున్నాయి.
‘మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ అని నమ్మిన సీఎం కేసీఆర్ మహిళల ఆరోగ్యం కోసం ‘ఆరోగ్య మహిళ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నది. తర్వాత దశల వారీగా 1,200 కేంద్రాలకు విస్తరించనున్నారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తున్నారు.
రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభు త్వం డైట్ చార్జీలను రెట్టింపు చేసింది. గతంలో రూ. 40 ఉండగా రూ.80కి పెంచింది. దీనికి ఏటా రూ. 43.5 కోట్లు ఖర్చు చేస్తున్నది. శానిటేషన్ చార్జీలను ఒక్కో బెడ్‌కు రూ.5,000 నుంచి రూ.7,500కు పెం చింది. ఇందుకు ఏటా రూ.338 కోట్లు వెచ్చిస్తున్నది. హైదరాబాద్‌లోని 18 ప్రముఖ దవాఖానల్లో రోగి సహాయకులకు రూ.5కే 3 పూటల భోజనం అందిస్తున్నది.
రాష్ట్ర ఆయుష్ విభాగం మెరుగైన పనితీరును కనబరుస్తున్నది. గత ఏడాది ఆయుష్ విభాగం ద్వారా 23 లక్షలకుపైగా మంది చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయుష్ పరిధిలో 4 ఆయుర్వేద దవాఖానలు, 3 హోమియో దవాఖానలు, 3 యునాని, ఒక నేచురోపతి దవాఖానలు ఉన్నాయి. 5 టీచింగ్ దవాఖానలు, ఒక డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్, రాష్ట్రవ్యాప్తంగా 440 ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయి.
కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు వంటి పథకాలను ప్రవేశపెట్టారు. ఏఎన్సీ చెకప్స్ విషయంలో పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించారు. ఆరోగ్య లక్ష్మి పేరుతో గర్భిణులకు పోషకాహారం అందించారు. కేసీఆర్ కిట్ బంపర్ హిట్ అయ్యింది. కేసీఆర్ కిట్‌తో ఇప్పటివరకు 13.91 లక్షల మంది లబ్ధి పొందగా, ప్రభుత్వం రూ.1,420 కోట్లు ఖర్చు చేసింది.
రోగాలను ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్సీడీ స్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నది. గత ఏడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్రీనింగ్ జరిగింది. క్యాన్సర్ స్క్రీనింగ్‌కు పరికరాలను అందుబాటులో ఉంచారు. పరికరాలు నిరంతరాయం పనిచేసేందుకు ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ప్రోగ్రాంను ప్రభుత్వం అమలు చేసింది.
సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఏటికేడు బడ్జెట్ కేటాయింపులు పెంచుతూ వచ్చారు. 2015-16లో వైద్యారోగ్యశాఖకు రూ.4,932 కోట్లు కేటాయించగా, 2023-24 బడ్జెట్లో ఏకంగా రూ.12,364 కోట్లు కేటాయించారు. ఎనిమిదేండ్లలోనే హెల్త్ బడ్జెట్ ఏకంగా రెండున్నర రెట్లు పెరిగింది. పెద్ద రాష్ర్టాల్లో తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తలసరి కేటాయింపు రూ.3,532గా నమోదైంది.
అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమం. 2018 ఆగస్టు 15న మొదటి విడత ప్రారంభమైంది. 1.54 కోట్ల మందికి కంటిపరీక్షలు చేసి, 40 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది జనవరి 18న రెండో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించగా, 80 రోజుల్లోనే కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించి, 38.60 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు.
ప్రభుత్వం టీ డయాగ్నస్టిక్స్‌ను ప్రారంభించి 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో ఓపీ, ఐపీ పేషెంట్లకు కలిపి గత ఏడాది రోజుకు 42 లక్షల టెస్టులు నిర్వహించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నీతి ఆయోగ్ విడుదల చేసిన 2021 ‘హెల్త్ ఇండెక్స్’లో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 3వ స్థానంలో, పురోగతిలో మొదటి స్థానంలో, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్‌లో నిలిచింది.
గర్బిణుల్లో 10 శాతం మంది టిఫా స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందని గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ఈ యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్.. రెండు నెలల్లోనే 44 దవాఖానల్లో 56 యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో గర్భిణులకు ఒక్కో స్కానింగ్‌కు రూ.2,000 వరకు ఆదా అవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.407 కోట్లతో 22 ఎంసీహెచ్‌లను ఏర్పాటు చేసింది. దేశంలో నే మొదటిసారిగా నిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ను తీసుకురానున్నారు.
గుండెపోట్లను గుర్తించి చికిత్స అందించేందుకు స్టెమీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, రిమ్స్ ఆదిలాబాద్, ఖమ్మంలో క్యాథ్‌ల్యాబ్‌లను ఏర్పాటు చేశా రు. వీటితోపాటు 74 ఉపకేంద్రాల ద్వారా ఈసీజీలు తీస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని 27,500 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్య శ్రీ కింద గత ఏడాది 2.59 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు. ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ సీం కింద 43,702 మంది లబ్ధి పొందారు.
గర్భిణుల్లో పోషకాహారలోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశలో 9 జిల్లాల్లో అమలు చేశారు. 8 రకాల వస్తువులు అందిస్తున్న దీనిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించే పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 43 కొత్త పీహెచ్సీ భవనాలను నిర్మిస్తున్నది. ఇందుకు రూ.67 కోట్లు ఖర్చు చేస్తున్నది. దీంతోపాటు రూ.43 కోట్లతో 372 పీహెచ్‌సీల మరమ్మతులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,239 సబ్ సెంటర్లకు భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున ఏకంగా రూ.247 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. అదనంగా 1,497 సబ్ సెంటర్ల భవనాలను రూ.60 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నది. 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించింది. 3,200 సబ్ సెంటర్లను ‘పల్లె దవాఖాన’లుగా అభివృద్ధి చేస్తున్నది.
చిన్న రోగమొచ్చినా ప్రైవేట్ దవాఖానకు వెళ్లే దుస్థితికి బస్తీ దవాఖానలతో ముగింపు కలిగింది. హైదరాబాద్‌లో 350, మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 370 బస్తీ దవాఖానలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. మరో 50 బస్తీ దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడేనాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే నాలుగు మెడికల్ కాలేజీలు స్థాపించారు. గత ఏడాది నవంబర్ 15న రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి.. దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 8 కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి లభించింది. అంటే.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తొమ్మిదేండ్లలోనే 20 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 25కు పెరిగింది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారికోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఉచిత డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వాటి సంఖ్య 102కు చేరింది. ఇప్పటి దాకా 10 వేల మంది ఉచితంగా డయాలసిస్ చేయించుకున్నారు. రోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్‌పాస్ ఇస్తున్నారు.
ఏటా 150 వరకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు. కిడ్నీ రోగులకోసం ప్రభుత్వం చేస్తున్న రూ.200 కోట్ల ఖర్చులో డయాలసిస్ రోగుల కోసమే రూ.100 కోట్లు ఖర్చు అవుతున్నాయి.