పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అదిరిపోయే బోణీ కొట్టింది. పేస్‌కు స్వర్గధామమైన పెర్త్ పిచ్‌పై ఇంగ్లండ్‌కు ఆసీస్ ముచ్చెమటలు పట్టించింది. ఆధిక్యం చేతులు మారుతూ రెండు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ 8 వికెట్లు తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(83 బంతుల్లో 123, 16ఫోర్లు, 4సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో కదంతొక్కాడు. బుల్లెట్లా దూసుకొస్తున్న బంతులకు ఎదురొడ్డి నిలుస్తూ యాషెస్ సిరీస్ చరిత్రలో హెడ్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్లో వచ్చి విఫలమైన హెడ్..తనకు బాగా అచ్చొచ్చిన ఓపెనింగ్‌లో ఇంగ్లండ్ బౌలర్లకు సింహస్వప్నంలా నిలిచాడు.
ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహానికి తనదైన రీతిలో చెక్‌పెడుతూ హెడ్ వీరవీహారం చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజకు గాయం కావడంతో వచ్చిన అవకాశాన్ని హెడ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. టీ20 శైలిని తలపిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 69 బంతుల్లోనే హెడ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కిక్కిరిసిన పెర్త్ స్టేడియంలో అభిమానులను అలరిస్తూ తన ఇన్నింగ్స్‌లో 16ఫోర్లు, నాలుగు భారీ సిక్స్‌లతో విజృంభించాడు. మరో ఓపెనర్ జేక్ వెదర్లాండ్(23)తో కలిసి తొలి వికెట్‌కు 75 పరుగులు జోడించిన హెడ్..బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో ఇన్నింగ్స్ కొనసాగించాడు.
కార్స్ బౌలింగ్‌లో వెదర్లాండ్ ఔటైనా..మార్నస్ లబుషేన్(51 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. విజయానికి మరో 13 పరుగుల దూరంలో ఉన్నప్పుడు కార్స్ బౌలింగ్‌లో పోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సిక్స్‌తో స్కోరును సమం చేసిన లబుషేన్..కెప్టెన్ స్మిత్(2 నాటౌట్)తో కలిసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. కార్స్(2/44)కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 123/9తో శనివారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ 132 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్(5/23) ఐదు వికెట్లతో రాణించాడు. 40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్..164 పరుగులకు పరిమితమైంది. బోలాండ్(4/33), స్టార్క్(55), డాగెట్(3/51)..ఇంగ్లండ్ పతనంలో కీలకమయ్యారు. అట్కిన్సన్(37) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 10 వికెట్లు తీసిన స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వచ్చే నెల 4 నుంచి బ్రిస్బేన్‌లో రెండో టెస్టు మొదలుకానుంది.
1 యాషెస్ సిరీస్‌లో 1921 తర్వాత రెండు రోజుల్లో టెస్టు పూర్తి కావడం ఇదే తొలిసారి.
1 స్టోక్స్, మెక్కల్లమ్ కాంబినేషన్లో విదేశాల్లో తొలి టెస్టు ఓడిపోవడం ఇంగ్లండ్‌కు ఇది మొదటిసారి