హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు… ప్రజలపై రోజురోజుగా భారీగా అప్పుల భారం మోపుతున్నారు. బోనస్ చెల్లింపునకు నిధులు లేవంటున్న కాంగ్రెస్ ప్ర భుత్వం.. పథకాలను ప్రచారం చేసుకోవడానికి పౌరసరఫరాలశాఖ నిధుల వరద పారిస్తున్నది. పథకాల వివరాలు ముద్రించిన ప్రత్యేక బ్యాగులను రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోని 1.02 కోట్ల రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగు ఇస్తున్నది. బ్యాగుల కొనుగోలుకు సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ సర్కారు పథకాల గురించి ప్రచారం చేసుకోవాలనేది బ్యాగుల పంపిణీలో ప్రధాన ఉద్దేశమని స్పష్టమవుతున్నది. కానీ ప్రభుత్వ వైఖరి నవ్వులపాలవుతున్నదని కార్డుదారులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే రేషన్‌కార్డుపై ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున బియ్యం ఇస్తారు. కార్డుపై కనీసం ఒక్కరుంటే ఆరు కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రేషన్‌కార్డుపై ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే బియ్యం పరిమాణం పెరుగుతుంది. ఉదాహరణకు ముగ్గురు లేదా నలుగురు సభ్యులుంటే 18-24 కేజీల బియ్యం పట్టే బ్యాగు ఇవ్వాలి. కానీ విచిత్రంగా ఐదు కేజీల పరిమాణం కలిగిన బ్యాగులను పంపిణీ చేస్తున్నది. కాబట్టి.. ఈ బ్యాగులలో బియ్యం ఇవ్వడం వీలుకాక, ఖాళీ బ్యాగులను కార్డుదారులకు అందిస్తున్నది. ఆ బ్యాగులతో ఎలాంటి ప్రయోజనం లేదనేది స్పష్టమవుతున్నది.
ప్రభుత్వం యాసంగికి 4 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేసింది. క్వింటాలుకు 500 చొప్పున రైతులకు రూ.1,160 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులు ధాన్యం విక్రయించి 7 నెలలు గడుస్తున్నది. ఇప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రశ్నిస్తే సర్కారు వద్ద పైసల్లేవని పౌరసరఫరాలశాఖ అధికారులు సమాధానం చెప్తున్నారు. వానకాలం సీజన్లోనూ సన్నాల రైతులకు బో నస్ అరకొరగా చెల్లిస్తున్నది. సుమారు రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 36 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు తెలిసింది. బోనస్‌పై నిర్లక్ష్యం చేస్తున్న సర్కారుకు.. సంచుల సరఫరా పేరుతో దుబారా ఖర్చుకు మాత్రం పైసలు ఉన్నాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.