గువాహటి: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. ఈశాన్య భారతంలో తొలిసారి జరుగుతున్న టెస్టు పోరులో ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్నది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోగా, మరోమారు టాస్ కోల్పోయిన టీమ్ఇండియా బౌలింగ్‌కు పరిమితమైంది. శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో రిషబ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్..సఫారీలను ఒకింత కట్టడి చేయడంలో సఫలమైంది. ఇప్పటికే తొలి టెస్టు చేజార్చుకుని ఒత్తిడిలో ఉన్న భారత్ చావోరేవో లాంటి పరిస్థితుల మధ్య పోటీకి దిగింది. గెలిస్తే గానీ సిరీస్‌ను కాపాడుకోలేని స్థితిలో ఉన్న టీమ్ఇండియా రెండో టెస్టుకు జట్టులో పలు మార్పులు చేసింది. గిల్ స్థానంలో సాయి సుదర్శన్, అక్షర్ పటేల్‌కు బదులుగా ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి జట్టులోకి వచ్చారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేశారు. ట్రిస్టన్ స్టబ్స్(49), కెప్టెన్ తెంబా బవుమా(41), మార్క్మ్(్ర38), రికల్టన్(35) రాణించారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్(3/48) మూడు వికెట్లతో అదరగొట్టగా, బుమ్రా(1/38), సిరాజ్(1/59), జడేజా(1/30) ఒక్కో వికెట్ పడగొట్టారు. సేనురన్ ముత్తుస్వామి(25 నాటౌట్), కైల్ వెరైన్(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న సఫారీలు ప్రస్తుతం 3 రన్‌రేట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.
తొలి టెస్టు గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న దక్షిణాఫ్రికా..సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా, మ్యాచ్ గెలిచి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని భారత్ చూస్తున్నది. ఈ నేపథ్యంలో మొదలైన రెండో టెస్టు తొలి రోజు నుంచే ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ఓవైపు డబ్ల్యూటీసీ చాంపియన్ హోదాలో సఫారీలు బరిలోకి దిగితే..వారికి చెక్ పెట్టేందుకు పంత్‌సేన ప్రణాళికలు రచించింది. ఓపెనర్లు మార్క్మ్,్ర రికల్టన్..దక్షిణాఫ్రికాకు మెరుగైన శుభారంభం అందించారు. పేస్ ద్వయం బుమ్రా, సిరాజ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఆదిలోనే వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో బుమ్రా సూపర్ స్వింగ్‌కు మార్క్మ్ క్లీన్‌బౌల్డ్ కావడంతో మొదటి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టబ్స్..రికల్టన్కు జత కలిశాడు. రికల్టన్‌ను ఊరించే బంతితో బోల్తా కొట్టించడం ద్వారా కుల్దీప్ యాదవ్ వికెట్ల ఖాతా తెరిచాడు. దీంతో దక్షిణాఫ్రికా 82 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో స్టబ్స్, బువుమా ఇన్నింగ్స్ బాధ్యతను భుజానేసుకున్నారు.
ఓవైపు బువుమా నిలకడ ప్రదర్శించగా, స్టబ్స్ భారత బౌలర్లపై దూకుడు ప్రదర్శించాడు. కుల్దీప్ బౌలింగ్‌లో స్టబ్స్ రెండు కండ్లు చెదిరే సిక్స్‌లు కొట్టి తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ప్రమాదకరంగా మారుతున్న బవుమాను జడేజా బుట్టలో వేసుకోవడం ద్వారా టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. భారీ షాట్ ఆడబోయిన బవుమా..జైస్వాల్ పట్టిన క్యాచ్‌తో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇదే అదనుగా తన వ్యూహాలకు పదునుపెడుతూ కుల్దీప్..స్టబ్స్‌ను ఔట్ చేయడంతో సఫారీల దూకుడుకు బ్రేక్ పడింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన సిరాజ్..టోనీ డీ జార్జ్(28)ను ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా కష్టాలు రెట్టింపయ్యాయి. ముల్దర్(13)..కుల్దీప్కు వికెట్ ఇచ్చుకోగా, ముత్తుస్వామి, వెరైన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మొత్తంగా 166/2తో మెరుగ్గా కనిపించిన సఫారీలు..246 పరుగులకు 6 వికెట్లు కోల్పోయారు.
సంక్షిప్త స్కోర్లు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 247/6 (స్టబ్స్ 49, బవుమా 41, కుల్దీప్ 3/48, జడేజా 1/30)