Bala Krishna |నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య–బోయపాటి కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురు చూడటం సహజం. గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు వరుసగా సంచలన విజయాలు అందించిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్లు సినిమాపై భారీ హైప్‌ను సృష్టించాయి. ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచింది.
రీసెంట్గా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇతర హీరోలకు తనకు ఎలాంటి పోటీ లేదని, కొంతమంది నటులు సెట్లకు రావడం మానేసి గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ల్లో షూటింగ్ పూర్తి చేసేస్తుంటారని, అయితే తాను మాత్రం పూర్తిగా ఒరిజినల్‌గా పనిచేస్తానని బాలయ్య సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసాయి. ఈ వ్యాఖ్యలను కొంతమంది నెటిజన్లు వివిధ రకాలుగా విశ్లేషిస్తుండగా, బాలయ్య అభిమానులు మాత్రం ఆయన చెప్పింది నిజమేని తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో బాలయ్య కామెంట్స్ చిన్నపాటి వివాదాన్నే రేపినట్లయ్యింది.
సినిమా విషయానికొస్తే, ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతం తమన్ అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.