Telangana | హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రం దివాలా తీసింది. పథకాల అమలుకు పైసల్లేవు. నన్ను కోసినా పైసా లేదు. మనల్ని చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లా చూస్తున్నారు. ఎక్కడా ఒక్క రూపాయి అప్పుపుడతలేదు’.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలివి. అయితే, చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఇక్కడ పైసల్లేవని బీద ఏడుపు ఏడుస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు, బీహార్‌లో రూ. కోట్లు ఖర్చు పెడుతూ అక్కడి పత్రికలకు భారీగా ప్రకటనలు జారీచేస్తున్నది. అక్కడి ‘దైనిక్ భాస్కర్’ దినపత్రికకు తెలంగాణ సమాచార, పౌరసంబంధాలశాఖ ద్వారా ప్రకటనలు జారీ అవుతున్నాయి. ఇక్కడ అరకొరగా అమలు చేస్తున్న పథకాలపై అక్కడ మాత్రం గొప్పగా అమలు చేసినట్టు మొదటి పేజీలో భారీ స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నది. రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫొటోలతో ప్రకటనలు గుప్పిస్తున్నది. పైసల్లేవంటూనే ఈ దుబారా ఖర్చు చేస్తున్న కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ భుజాన వేసుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే ఇక్కడి సొమ్ముతో అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం బీహార్ ప్రభుత్వంతో పోటాపోటీగా అక్కడ ప్రకటనలు కుమ్మరిస్తున్నది. నెలలో నాలుగుసార్లు మొదటి పేజీ ప్రకటనలు ఇస్తున్నది. జూలై 18, 25, ఆగస్టు 1, 8న వారం తప్పించి వారం నాలుగు వారాలు ప్రకటనలు ఇచ్చింది. ఎన్నికల వరకు ఈ ప్రకటనల పరంపర కొనసాగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అవసరమైన బడ్జెట్‌ను కూడా విడుదల చేసినట్టు సమాచారం. బీహార్ ఎన్నికలు కాంగ్రెస్‌కు చావోరేవో లాంటివి. అక్కడి ఎన్నికల బాధ్యతను పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణకు అప్పగించినట్టు తెలిసింది. మొదటి పేజీ ప్రకటనకు రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. ఇలా తెలంగాణ ప్రజల సొమ్ము బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి ఇంధనంగా మారుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడి పథకాల అమలుకు లేని పైసలు బీహార్‌లో ప్రకటనలకు ఎక్కడి నుంచి వస్తున్నాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో అరకొరగా అమలు చేస్తున్న, చేయని పథకాలపై బీహార్‌లో కాంగ్రెస్ గొప్పగా ప్రకటనలు గుప్పిస్తున్నది. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు జూలై 18న ప్రకటన ఇచ్చింది. నిజానికీ పథకం ఇంకా అమలు కాలేదు. కానీ, ఆ ప్రకటనతో అక్కడి ప్రజలను మభ్య పెడుతున్నది. అలాగే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందరికీ అందిస్తున్నట్టు జూలై 25న ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నది. ఈ నెల 1న ఉచిత బస్సు గురించి, 8న రుణమాఫీ, రైతు భరోసా, ఫసల్ బీమా, రైతుబీమా, బోనస్‌లపై ప్రకటన ఇచ్చింది. ఇక్కడ మాత్రం రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. రైతుభరోసాను రెండు సీజన్లలో ఎగ్గొట్టింది. ఇక, పంటల బీమా అమలు చేయకున్నా చేసినట్టు అక్కడ గొప్పగా ప్రకటన ఇచ్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.