హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆత్మగౌరవ నినాదంతో పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా నిర్మించి ఇస్తున్నది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్ బెడ్రూం ఇండ్లకు డిజైన్ చేసింది. లబ్ధిదారులు పైసా కూడా చెల్లించకుండా రెండు బెడ్రూంలు, రెండు మూత్రశాలలు, ఒక కిచెన్, హాలుతో కూడిన ఇంటి కోసం మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించి నిర్మాణం పూర్తి చేసి వారికి అందజేస్తున్నది.
మొదటి దశలో హైదరాబాద్‌లోని 9 ప్రాంతాల్లో మొత్తం 11,700 మంది లబ్ధిదారులకు ఇండ్లను లాటరీ ద్వారా డ్రా తీసి కేటాయించారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో చదరపు అడుగు విస్తీర్ణం ధర రూ.4,500 నుంచి రూ.6 వేల దాకా ఉన్నది. ఈ లెక్కన వీటి విలువ ఆయా ప్రాంతాలను బట్టి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల విలువ చేస్తాయి. తక్కువ స్థలంలో కాకుండా కొన్ని ఎకరాల స్థలాన్ని కేటాయించి, అందులో సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. దీంతో వీటి విలువ బహిరంగ మార్కెట్లో మంచి విలువ ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, లిప్టులు వంటి సౌకర్యాలు కల్పిస్తుండటంతో వాటికి ఎంతో విలువ ఉన్నది.
గతంలో పేదల కోసం నిర్మించే ఇండ్లు ఇరుకుగా అగ్గిపెట్టెల్లా ఉండేవి. బీఆర్ఎస్ ప్రభు త్వం రెండు పడక గదుల ఇండ్లను కార్పొరేట్‌స్థాయిలో నిర్మించి పేదల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసింది. కొల్లూరులో టౌన్‌షిప్‌ను తలపించే ఈ హౌసింగ్ కాలనీ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే హడ్కో అవార్డును సొంతం చేసుకున్నది. మరిన్ని ప్రతిష్ఠాత్మక అవార్డులు ఈ ప్రాజెక్టుకు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ధృడసంకల్పం, ఉన్నతస్థాయి అధికారులు, మంత్రుల పర్యవేక్షణ, నిర్మాణ సంస్థ ప్రతినిధుల చిత్తశుద్ధి ఫలితంగానే కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు దశలవారీగా కేటాయించే ప్రక్రి య మొదలైంది. సకల హంగులతో, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించి పేదలకు పంపిణీ చేయనున్నారు.