హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలం గాణ): రాష్ట్రంలో కొత్త వాహనం కొనాలనుకునే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది. ప్రజాపాలనలో ఎలాంటి ట్యాక్స్‌లు ఉండబోవని చెప్పిన ప్రభుత్వం 20 నెలలు తిరగక ముందే అదనపు భారం మోపింది. కేంద్రం కన్నా రాష్ట్రమే ఎక్కువగా ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నది. ప్రభుత్వ ఖజానాకు ఆశించిన రాబడి లేకపోవడంతో ఆర్టీఏ ద్వారా వాహనదారులను టార్గెట్ చేసింది. దాదాపు రూ.2,500 కోట్ల అదనపు రాబడి లక్ష్యంగా దొడ్డిదారిన లైఫ్ ట్యాక్స్ పెంపు ఉత్తర్వులు ఇస్తున్నది. దీని ప్రకారం కొత్త బైక్‌లపై 9% నుంచి 18% వరకు ట్యాక్స్ విధిస్తారు. ఇది వాహన ధరపై ఆధారపడి ఉన్నా, కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి పెను భారంగా మారనుంది. కార్లు, జీపుల వంటి నాన్-ట్రాన్స్ పోర్ట్ ఫోర్-వీలర్లపై 13% నుంచి 21% వరకు ట్యాక్స్ ఉంటుంది. కంపెనీలు లేదా రెండో వ్యక్తిగత వాహనాలకు 15% నుంచి 25% వరకు ట్యాక్స్ విధిస్తారు.
ఈ పెరిగిన ట్యాక్స్ రేట్లు పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారం కానున్నాయి. ఉదాహరణకు, రూ.1.10 లక్షల ధర ఉన్న బైక్‌పై టాక్స్ కనీసం రూ.13,200 నుంచి రూ.16,500కి పెరిగింది. అంటే అదనంగా రూ.3,300 చెల్లించాలి. మధ్య తరగతి ప్రజలు లోన్లు తీసుకొని, అప్పులు చేసి కార్లు కొనుగోలు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.10లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి. అలాంటిది కార్ల మీద కూడా లైఫ్ ట్యాక్స్ వేసి ప్రజల నుంచి దండుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. రూ.10-20 లక్షల కారు కొంటే 17శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి పెంచడంతో రూ.20 వేల అధిక భారం కొనుగోలుదారులపై పడింది. అదే కారు రూ.20లక్షలు దాటితే 2 శాతం, 50 లక్షలు దాటితే 3 శాతంగా పెంచింది. లైఫ్ట్యాక్స్తో పాటు ఫ్యాన్సీ నంబర్ల ధరను కూడా ప్రభుత్వం విపరీతంగా పెంచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యంగా తీసుకొచ్చిన ఈ ఉత్తర్వులు.. మన్ముందు మరిన్ని చిక్కులను తెచ్చిపెడుతుందని వాహనదారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వినియోగదారులపై అదనపు భారం పడేలా చేస్తుంది. లైఫ్ ట్యాక్స్ పెంపు కారణంగా రవాణా శాఖ ఆదాయం గణనీయంగా పెరగనుంది. గతంలో వచ్చిన రూ.4,401 కోట్ల ఆదాయనికి తోడు.. మరో రూ.2,500 కోట్లు కలిపి.. సుమారు రూ.7వేల కోట్ల నిధులను ప్రభుత్వం సమకూర్చుకోనున్నది.