హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రశ్నించే గొంతుకలంటేనే భయపడుతున్నది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే ధైర్యంలేక.. దొంగదారిలో పోలీస్ కేసులు పెట్టిస్తూ భయపెట్టాలని చూస్తున్నది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అడ్డగోలుగా కేసులు పెడుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకు ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై 23 కేసులు, కొణతం దిలీప్‌పై 12 కేసులను నమోదు చేశారు. బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా ఉన్న సబ్బండ వర్గాలు, కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతూ తమ ఆవేదనను వెల్లగిక్కినా? ఆ ప్రజల వేదనను ఎవరైనా వెలిబుచ్చినా? సోషల్ మీడియాలో పోస్టు చేసినా? సామాజిక మాధ్యమాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడినా! పోలీసులతో ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నది. తాజాగా హెచ్‌సీయూలో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌పై కక్షగట్టి మరీ కేసులు పెట్టించింది.
తనపై కేసులు పెట్టడంపై బీఆర్ఎస్ నేత కిషాంక్ స్పందించారు. ఎక్స్‌లో రాహుల్‌గాంధీని ట్యాగ్ చేస్తూ.. ‘ఇదేనా మీ ప్రజాస్వామ్యం’ అని ప్రశ్నించారు. కృత్రిమ మేధస్సును, చిత్రాలను లేదా వీడియోలను సృష్టించలేదని స్పష్టంచేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వైల్డ్ లైఫ్ అండ్ ట్రీస్ ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా నమ్మినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేయడం సరైనదేనా? అని నిలదీశారు. హెచ్‌సీయూలో జింకలే లేవని అబద్ధాలు ఆడిన సీఎం రేవంత్‌పైనే కేసులు నమోదు చేయాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.
తనపై తాజాగా నమోదైన కేసుపై కొణతం దిలీప్ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కంచ గచ్చిబౌలిలో సీఎం రేవంత్ దారుణం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు క్రిషాంక్, తనపై తప్పుడు కేసులు పెట్టించిందని తెలిపారు. కాంగ్రెస్ సరార్ ఎన్ని కేసులు పెట్టించినా, మీ అబద్ధపు, అరాచక, అవినీతి పాలనపై మా ప్రశ్నలు ఆగవని హెచ్చరించారు.