Cough Syrup | పిల్లలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు దగ్గు మందులను రాష్ట్రంలో నిషేధించింది. ఇప్పటికే కోల్డ్ రిఫ్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) ప్రకటించగా.. తాజాగా రిలీఫ్, రెస్పి ఫ్రెస్-TR సిరప్లపై నిషేధం విధించింది. ఈ రెండు సిరప్లలో కల్తీ జరిగిందని తేలడంతో వాటి విక్రయాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దగ్గు మందు వాడకంపై ఇప్పటికే ప్రజారోగ్య విభాగం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. పిల్లల్లో సాధారణంగా దగ్గు, జలుబు వచ్చినప్పుడు తగిన నివారణ చర్యలతోనే కట్టడి చేయవచ్చని.. వెంటనే తగ్గిపోవాలని ఎడాపెడా మందులను వాడితే చిన్నారుల ప్రాణాలకే ప్రమాదమని ప్రజారోగ్య విభాగం హెచ్చరించింది. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందు ఇవ్వద్దని సూచించింది. ఐదేళ్లలోపు చిన్నారులకు అత్యవసరమైతేనే దగ్గు మందు వాడాలని తెలిపింది.