Dedicated Commission | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ వెంకటేశ్వర్లు సారధ్యంలోని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. నెల రోజుల్లోపు నివేదిక అందజేయాలని ఆ జీవోలో పేర్కొన్నది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టంగా తెలిపింది.
ఈ నెల ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉపాధి పరంగా, కుల ప్రాతిపదికన సర్వే ప్రారంభం కానున్నది. దీంతో బీసీ రిజర్వేషన్ల విషయమై భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కుల గణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను సర్కార్ సమీక్షించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి భేషజాలు లేవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.