హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టుగా గౌడ సంఘాల ముఖ్యనాయకులు ప్రకటించారు. శనివారం బేగంపేటలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఎైక్సెజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు, రాష్ట్ర కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్ మాట్లాడుతూ.. గౌడల సంక్షేమం, గౌడ వృత్తిదారుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ వెన్నంటే యావత్తు గౌడ సంఘాలు ఉన్నాయని తెలిపారు. ఉమ్మడిరాష్ట్రంలో కుల వృత్తులను నిర్లక్ష్యం చేశారని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కల్లు విక్రయాలపై నిషేధం విధించి గౌడల ఆత్మగౌరవాన్ని, వృత్తిని ప్రశ్నార్థకం చేశారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరిపించటంతోపాటు కల్లు దుకాణాల లైసెన్సు బకాయి రూ.16 కోట్లను రద్దు చేశారని, నీరా పాలసీని రూపొందించారని చెప్పారు. నీరాను గౌడ్స్ మాత్రమే ఉత్పత్తి చేసి విక్రయించేలా జీవో తీసుకొచ్చి గౌరవించారని కొనియాడారు.
మద్యం దుకాణాల్లో గౌడలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించి అండగా నిలిచారని తెలిపారు. గౌడల ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు పాపన్న గౌడ్ ట్రస్ట్‌కు వందల కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కేటాయించి భవన నిర్మాణానికి రూ.ఐదు కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గౌడల ఆత్మ గౌరవాన్ని పెంచిన సీఎం కేసీఆర్‌కు గౌడ సంఘాలు కృతజ్ఞత పూర్వకంగా మునుగోడు ఉప ఎన్నికలో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని గౌడలు టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలిపి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రులను కలిసిన వారిలో రాష్ట్ర గౌడ సంఘాల ముఖ్య నాయకులు అయిలి వెంకన్నగౌడ్, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, అఖిల భారత గౌడ సంఘం కూరేళ్ల వేములయ్యగౌడ్, గౌడ ఐక్యసంఘాల సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, ఎలికట్టే విజయ్‌కుమార్‌గౌడ్, నాచగొని రాజయ్యగౌడ్, సంజయ్‌గౌడ్, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు యాదగిరిగౌడ్, మండ వెంకన్నగౌడ్, నారగోని కుమార స్వామిగౌడ్, ప్రసాద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.