హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల వేతనాలు, బిల్లులు జారీచేసేందుకు అనుసరిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఐఎఫ్ఎంఐఎస్), టోకెన్ల ద్వారా బిల్లుల జారీ విధానం తమకొద్దని, దీనిని తక్షణమే రద్దుచేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విధానంతో పైరవీకారులకే ప్రయోజనం కలుగుతున్నదని స్పష్టంచేశారు. కాంట్రాక్టర్లు, ప్రజాసేవ చేసే ఉద్యోగులను ఒకే గాటన కట్టడం సరికాదని పేర్కొన్నారు.
ఐఎఫ్ఎంఐఎస్, టోకెన్ విధానంలో వేతనాలు చెల్లించడం, బిల్లులు జారీచేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంచేశారు. ఒకటో తేదీన జీతం పడటం, బిల్లు సమర్పించిన మరుసటి రోజే జారీకావడమన్నది ఉద్యోగులకున్న ప్రివిలేజ్‌గా అభివర్ణించారు. ఐఎఫ్ఎంఐఎస్, టోకెన్ విధానంలో ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగాలు నామనాత్రమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా ఏకమై రాష్ర్టాన్ని సాధించుకున్నారని, అనేక ప్రభుత్వాలను పడగొట్టిన ఘనత ఉద్యోగ సంఘాలకు ఉన్నదని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వమని కొంతకాలం ఆగుతున్నామని, సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ‘నమస్తే తెలంగాణ’కు ఏలూరి శ్రీనివాసరావు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఉద్యోగులకు సంబంధించి ఆరు హామీలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి. ఒకట్రెండు డిపార్ట్మెంట్లు మినహా ఒకటో తేదీన జీతాలు తీసుకుంటున్నాం. ఇందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, మాడల్ స్కూల్ సిబ్బందికి, మార్కెట్ కమిటీ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలివ్వాలి. సీపీఎస్‌ను ప్రభుత్వం రద్దుచేస్తుందని నమ్ముతున్నాం. జీవో-317పై కమిటీ వేశారు. హడావుడిగా కాకుండా కేసుల వారీగా స్పౌజ్, లోకల్, మ్యూచువల్ వంటి సమస్యలను పరిష్కరించాలి. మళ్లీ సమస్యలు తలెత్తకుండా పరిష్కారం చూపాలి. పెండింగ్‌లోని, దీర్ఘకాలిక సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రాథమిక సభ్యుల్లో తమ సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలన్న భావన వ్యక్తమవుతున్నది. దీనిని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి.
రాష్ట్రంలో మొత్తంగా రూ.5 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో రూ.2 వేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులను చెల్లించినట్టు సమాచారం ఉన్నది. 3 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిని కూడా వెంటనే చెల్లించాలి. గత ప్రభుత్వంలోనివే కాకుండా కొత్త ప్రభుత్వంలోనూ ఆరు మాసాలుగా బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు రూ.లక్ష లోపున్న బిల్లులు మాత్రమే జారీ అయ్యాయి. గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు గల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇప్పుడున్న పీఆర్సీ కమిటీ గడువును అక్టోబర్ వరకు పొడగించారు. కమిటీ నివేదిక సమర్పించి, కొత్త పీఆర్సీ అమలయ్యేసరికి డిసెంబర్ వరకు పట్టవచ్చు. 41% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తు న్నాం. పీఆర్సీ కమిటీకి ప్రతిపాదనలిచ్చాం. తరుచూ పీఆర్సీ కమిటీతో భేటీ అవుతున్నాం. 5% మధ్యంతర భృతి ఇవ్వడం అశాస్త్రీయం. మేమిప్పుడు ఐఆర్ కోరుకోవడంలేదు. మా డిమాండ్లల్లో ఐఆర్ లేదు. మెరుగైన ఫిట్‌మెంట్‌ను సాధించాలన్నదే లక్ష్యం.
ఉద్యోగులకు పదిహేనేండ్ల నుంచి హెల్త్‌కార్డులు లేవు. ఉద్యోగుల హెల్త్కార్డులంటేనే అటు ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ఇటు దవాఖానలు నమ్మడం లేదు. బిల్లులు పెండింగ్‌లో ఉండటమే ఇందుకు కారణం. హెల్త్‌కార్డులు లేక ముఖ్యంగా పెన్షనర్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తో లాభం జరగడం లేదు. 30 ఏండ్ల క్రితం ఖరారు చేసిన ధరలే ఇప్పటికీ అమలవుతున్నాయి. ఒక వ్యాధికి రూ.8 లక్షలు ఖర్చయితే కేవలం రూ.80 వేలు ఇస్తున్నారు. అదీ టోకెన్ విధానంలో రెండేండ్లు దాటిన తర్వాత ఆయా డబ్బులు వస్తున్నాయి. ఇదేం విధానం? ప్రభుత్వం తక్షణమే గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన ఈహెచ్ఎస్ విధానాన్ని అమలుచేయాలి. నగదురహిత, అపరిమిత చికిత్సనందించాలి.
ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టడం హర్షణీయం. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. ఎన్నికలకు ముందే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలు (డీపీసీ) ఏర్పాటయ్యాయి. డీపీసీ సమావేశాలను త్వరగా నిర్వహించి శాఖల వారీగా పదోన్నతులు కల్పించాలి. జీవో-317 ద్వారా ఉద్యోగుల కేటాయింపు అశాస్త్రీయంగా జరిగింది. కొత్త జిల్లాల ప్రకారం క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరుచేయాలి. అన్నిశాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీచేయాలి. నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులను వెంట వెంటనే భర్తీ చేసి, ఉద్యోగులను కేటాయించాలి.
ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల్ని మూడో తరగతి పౌరుల్లా చూస్తున్నది. ఉద్యోగులకు ఎన్నో చేశామని చెప్తుంటారు కానీ, అరకొరగానే అమలుచేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రం అనే తేడాల్లేకుండా అన్ని ప్రభుత్వాలు ఇదే విధానాన్ని అమలుచేస్తున్నాయి. సంఘా ల నాయకులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలమన్న ధీమాతో ఉన్నాం. సమస్యలు పరిష్కరించగలమన్న నమ్మకం ఉన్నది. అయితే కొత్త ప్రభుత్వమని, కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆగాం. మా డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో సోదర సంఘాలను కలుపుకుని జేఏసీ పక్షాన ఉద్యమిస్తాం.
ఉద్యోగులంటేనే ప్రజల్లో వ్యతిరేక భావన స్థిరపడింది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేవేవీ వారికి వద్దు.. ఇవ్వొద్దు అనే భావన వ్యక్తమవుతున్నది. ఈ రోజు ఆఫీసు సబార్డినేట్ జీతమెంత ? తిప్పికొడితే రూ.20 వేల జీతం రాదు. కానీ, ఆ ఉద్యోగి తల్లికి పెన్షన్ రాదు. ఆ ఇంటికి రేషన్‌కార్డు ఉండదు. బరాబర్ ట్యాక్స్ కట్టేది మేమే. బరాబర్ పనిచేసేది మేమే. కానీ మేమంటేనే ఈర్ష్య పడుతుంటారు. ఉద్యోగం వచ్చిందంటే కుటుంబం మొత్తానికి తెల్లకార్డు కట్. అన్ని రాయితీలు కట్. ఇంట్లో నలుగురుంటే ఒక్కరికి ఉద్యోగం వస్తే మిగతా ముగ్గురిని ఇబ్బంది పెట్టడం భావ్యమా? తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం సమంజసమా? కుటుంబసభ్యుల్లోనూ ఉద్యోగులంటే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రైతుబంధు, రుణమాఫీపై ప్రభుత్వం ఈ దిశలో ఆలోచించాలి.
గతంలో ఏ పీఆర్సీని కూడా సమాయానికి ఇవ్వలేదు. డీఏలు సమయానికి రాలేదు. పెండింగ్‌లోని డీఏలను త్వరగా ఇవ్వాలని కిందిస్థాయి ఉద్యోగులు కోరుకుంటున్నారు. పెండింగ్‌లోని ఐదు డీఏల మొత్తం రూ.5 వేల కోట్లు బాకీ పడింది. మూడు డీఏలు ఎలాగూ పీఆర్సీలో కలుస్తాయి. కనీసం రెండు డీఏలనైనా తక్షణమే విడుదల చేయాలి. ఇదే విషయంపై పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని, సీఎస్‌ను కలిశాం. ఉద్యోగులంతా డీఏలు విడుదల చేయాలని కోరుతున్నారు. దీనిపై మాపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉన్న మాట వాస్తనం. ప్రభుత్వం కనీసంగా రెండు డీఏలైనా విడుదల చేస్తే ఉపశమనం దొరుకుతుంది.