Jagadish Reddy : విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వ చేసుకున్న ఒప్పందాలపై విచారణ చేస్తున్నది. ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు అసెంబ్లీలో సమాధానం కూడా ఇచ్చాం. శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’ అని తెలిపారు.
‘విద్యుత్ ఒప్పందాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసింది. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా ఉంది. వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనపిస్తోంది. అందుకు నరసింహారెడ్డి విచారణ అర్హత లేదని, కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు’ అని మాజీ మంత్రి చెప్పారు.
‘వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదు. 15 లోపే వివరణ ఇవ్వాలన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగ మార్చిన కేసీఆర్‌పై ఆయన సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. ఆయన తన అభిప్రాయాన్ని ముందే మీడియాకు చెబుతున్నాడు. ఇది తప్పు’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు.