హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఆరున్నర దశాబ్దాల ‘తెలంగాణ రాష్ట్ర’ ఆరాటాన్ని పోరాటంగా మలిచి, స్వరాష్ర్టాన్ని కండ్లముందు నిలిపిన సుదినం 2014, జూన్ 2. దానిని సాకారం చేసిన పోరాటయోధుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి పదకొండేండ్లు పూర్తి చేసుకున్నది. స్వరాష్ట్రం కోసం 1952 నుంచి 1969 దాకా, 1969 నుంచి 2001 దాకా, 2001 నుంచి 2014 దాకా తెలంగాణ దశలవారీగా అలుపెరుగని పోరాటం చేసింది. దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అణచివేతలపై ఎన్ని పోరాటాలు సాగినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27వ తేదీన గులాబీ జెండా ఎగిరినప్పటి నుంచి సుదీర్ఘకాలం సాగిన ఉద్యమం మాత్రమే గమ్యాన్ని ముద్దాడింది. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అణచివేతకు గురైంది. మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో 2001లో ప్రారంభమైనా, 2009 తర్వాతే ఉద్యమం కీలక మలుపులు తిరిగి, చివరికి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అరుదైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే 2009 అక్టోబర్‌లో పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్‌లో లోకల్ రిజర్వేషన్లు ఎత్తివేసి ‘ఫ్రీ జోన్’గా ప్రకటించడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరింది. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా మార్చితే తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాల్లో తెలంగాణ యువత రిజర్వేషన్లు కోల్పోతారని, అది 610జీవోకు విరుద్ధమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. అలా తుది దశ ఉద్యమాన్ని సృష్టించింది ఆ ఫ్రీ జోన్ అంశం. ఆ తర్వాత 2009 నవంబర్ 29న ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను తలపెట్టిన సంగతి తెలిసిందే. నాటి సమైక్యపాలకులు కేసీఆర్‌ను అరెస్టు చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని చూశారు. సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఆమరణ నిరహారదీక్షా స్థలికి కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను అల్గునూర్ చౌరస్తాలో అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. పోలీసులు తనను అరెస్టు చేసిన క్షణం నుంచే ఆరమరణ నిరాహార దీక్షకు దిగుతున్నానని ప్రకటించి, అక్కడి నుంచి ఖమ్మం జైలుకు తరలించినా ఆయన నిరాహార దీక్షను వీడలేదు.
కేసీఆర్ దీక్ష నవంబర్ 29వ తేదీ నుంచి 11 రోజులపాటు తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసింది. తెలంగాణ సమాజం ఒక్కటై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింపజేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9న ‘రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నాం’ అని ప్రకటించాల్సిన అనివార్యతను కేసీఆర్ సృష్టించారు. డిసెంబర్ 23న ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో ఉద్యమం మళ్లీ పతాకస్థాయికి చేరింది. కేసీఆర్ ఆమరణ దీక్షతో బెంగటిల్లిన శ్రీకాంతాచారి ఆత్మబలిదానంతో మొదలైన ఆత్మహత్యల పరంపర కొనసాగింది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాత్సారం చేయటంతో వందలాది మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవటానికి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పోరాటాలు, పార్టీలకు అతీతంగా ఏర్పడిన జేఏసీలు ఉవ్వెత్తున ఉద్యమించాయి. కేసీఆర్ పర్యవేక్షణ, నాయకత్వంలోని పొలిటికల్ జేఏసీ మిలియన్ మార్చ్, సాగరహారం తదితర మెరుపు ఉద్యమాలు తెలంగాణ చరిత్రను మలుపుతిప్పాయి. మరోవైపు దేశంలోని 36 రాజకీయ పార్టీలతో తెలంగాణకు అనుకూలంగా కేసీఆర్ కేంద్రానికి ఉత్తరాలు తెచ్చి ఇవ్వడంతో విధిలేని పరిస్థితులతో కేంద్రం దిగొచ్చింది. ఫలితంగా 2014 ఫిబ్రవరి 13న లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 18న లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం, తర్వాత ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదముద్ర పడింది. 2014 మార్చి 1 రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఫలితంగా జూన్ 2న తెలంగాణకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.
అనేక పోరాటాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమించింది. రాష్ట్రం విడిపోతే అంధకారంలో మునిగిపోవడం ఖాయమన్న అనుమానాలను పటాపంచలు చేసింది. పాలన చేతకాదన్న అవహేళనలకు అభివృద్ధితో చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చింది. బీఆర్ఎస్ రెండు పర్యాయాల పాలనలో తెలంగాణ అద్వితీయ ప్రగతిని సాధించింది. దేశానికే తలమానికంగా నిలిచింది.