రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు నిర్లక్ష్యంపై సిరిసిల్ల జిల్లా రైతులు కన్నెర్రజేశారు. అట్టహాసంగా కేంద్రాలు ప్రారంభించినా.. కాంటా పెట్టకపోవడంతో ఓపిక నశించి వీర్నపల్లి, గంభీరావుపేట, చందుర్తి మండలాల రైతులు మండుటెండలో గురువారం రోడ్డెక్కారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన వంద మంది రైతులు సిరిసిల్ల కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అధికారులకు తమ గోడువెళ్లబోసుకుంటామని కోరితే పోలీసులు లోనికి అనుమతించకుండా గేట్లు మూసి వేశారు.
ఆగ్రహించిన రైతులు నిప్పుల కొలిమిలా ఉన్న ఎండను సైతం లెక్కచేయకుండా కరీంనగర్ – సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు జోక్యం చేసుకుని అధికారుల వద్దకు తీసుకెళ్తామని నచ్చజెప్పి రోడ్డుపై కూర్చున్న రైతులను బలవంతంగా లేపారు. అక్కడి నుంచి కలెక్టరేట్ గేట్ ముందు బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పినా రైతులు వినకపోవడంతో ఐదుగురు రైతులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వద్దకు తీసుకెళ్లారు. ధాన్యం కొనుగోళ్లు చేసి లారీలను పంపిస్తామని కలెక్టర్ ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు.
గంభీరావుపేట మండలం ముస్త్తఫానగర్లో ధాన్యం కొంటలేరంటూ రైతులు ప్రధాన రోడ్డుపై ఆందోళనకు దిగారు. తహసీల్దార్ మారుతిరెడ్డి రైతులకు ఫోన్ చేసి వెంటనే కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చందుర్తి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, తహసీల్దార్ సీహెచ్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు.
లక్ష్మణచాంద, ఏప్రిల్ 24: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పొట్టపెల్లి(కే) గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. గురువారం లక్ష్మణచాంద-కనకాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. పంట కోత దశకు వచ్చినా అధికారులు, ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ దాదాపు 100 మందికిపైగా రైతులు బైఠాయించారు.
కేసీఆర్ హయాంలో పొట్టపెల్లి(కే)లోనే కేంద్రాన్ని ప్రారంభించారని, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎత్తివేసిందని మండిపడ్డారు. ధాన్యాన్ని అమ్ముకోవడానికి రాచాపూర్ లేదా లక్ష్మణచాంద గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సై మాలిక్ రెహమన్ అక్కడికి చేరుకుని తహసీల్దార్ జానకీకి పరిస్థితి వివరించారు. 24 గంటల్లో కేంద్రాన్ని మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.