ఎల్కతుర్తి, జనవరి 11 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు రక్షణ సమితి నాయకులు నిరసన తెలిపి మాట్లాడారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రైతుభరోసాలో కోతలు విధించడం సరికాదని అన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు చెల్లించే బోనస్ రైతులకు పూర్తిగా అందడం లేదని వాపోయారు. కేసీఆర్ సర్కార్ కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు రక్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్‌రావు, జిల్లా అధ్యక్షుడు హింగె భాస్కర్ పాల్గొన్నారు.