Kodangal | కొడంగల్, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పథకం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టంచేశారు. తమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన పేరుతో సాగు భూములను గుంజుకుని కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై బాధిత రైతులు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి సమస్యను వివరించిన విషయం తెలిసిందే. కొడంగల్ ప్రజలకు హాని కలిగించే ఫార్మా కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకోవాలని రైతులు రోజురోజుకూ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.
అందులో భాగంగానే ఆదివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటలో ఫార్మా కంపెనీ భూ బాధిత రైతులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి కలలుకంటున్న కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం నియోజకవర్గ రైతుల కోసమా? లేక ఫార్మా కంపెనీల కోసమా? అంటూ ప్రశ్నించారు. కొడంగల్ ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే ఎటువంటి అభివృద్ధి పనులకైనా పూర్తి మద్దతు ఇస్తామని, కానీ ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి పొల్యూషన్ అంటగట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.
ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని నమ్మబలుకుతూ కొడంగల్ అమాయక ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు సెంటు భూమిని కూడా ఇచ్చేది లేదని, రైతుల పక్షాన ఉంటూ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. అభివృద్ధి పేరుతో సాగు భూములను లాక్కుంటులే ఎత్తిపోతల పథకంతో వచ్చే సాగునీరు ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. భూములే లేనప్పుడు సాగునీరెందుకుని నిలదీశారు. కొడంగల్ ప్రజలు రేవంత్‌కు సీఎం పదవిని కట్టబెడితే.. రేవంత్ కొడంగల్ ప్రజలకు బహుమానంగా పొల్యూషన్‌ను అంటడగుతున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని, ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, రైతులు, ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. సీఎంకు కొడంగల్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే ఐటీ, టెక్స్టైల్, అమెజాన్, ఎలక్ట్రిల్ వాహనాల తయారీ వంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయని, వాటిని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట గ్రంథాలయ మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భీములు, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, భూ బాధిత రైతులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.