న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాలకు దక్కని పురస్కారాలు తెలంగాణకు లభించాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. గ్రామాల అభివృద్ధి విషయంలో తెలంగాణనే బెస్ట్ అన్న విషయం ఈ అవార్డుల ద్వారా నిరూపితమైందని అన్నారు. ఉత్తమ పంచాయతీలకు జాతీయ పురస్కారాలు అందుకున్న అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన జాతీయ ఉత్తమ పురస్కారాలు 46లో 13 అవార్డులను తెలంగాణ దక్కించుకున్నదని తెలిపారు.
తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపొందాలనే ఉన్నతమైన లక్ష్యంతో సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 2019లో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా రెండు నెలలకోసారి గ్రామసభ, ప్రతినెలా గ్రామ పంచాయతీ సమావేశం తప్పనిసరిగా ఏర్పాటుచేసి, గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చిస్తున్నామని తెలిపారు. మూడు వేలకు పైగా తండాలు, గూడేలను నూతన గ్రామపంచాయతీలుగా మార్చామని చెప్పారు.
మిషన్ భగరీథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వంద లీటర్ల నీటిని అందిస్తున్నామని తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ పథకానికి ప్రేరణ తెలంగాణ మిషన్ భగీరథ అని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణను కేంద్రం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ కోరినట్టుగా ఈజీఎస్ను వ్యవసాయంతో అనుసంధానం చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో నిరుడు కేటాయించిన 11 కోట్ల పని దినాలను7 కోట్లకు తగ్గించడం సరైంది కాదన్నారు. కొత్తగా ఉపాధి హామీలో డిజిటల్ హాజరు పేరుతో కూలీలను ఇబ్బందులు పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అవార్డులైతే ఇస్తున్నదని, నిధుల విషయంలో వెనుకడుగు వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.