హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా విస్తరించడమే కాకుండా, కృష్ణా జలాలను ఏటా భారీగా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆరోపించింది. అంతేకాకుండా తెలంగాణ ఆయకట్టును కుట్రపూరితంగా తగ్గించి, ఏపీ ఆయకట్టును మాత్రం పెంచుకున్నదని తెలిపింది. ఈ మేరకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ నివేదించారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు రెండు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం పునఃప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ రాష్ట్రం తన తుది వాదనలను కొనసాగించింది.
నాగార్జునసాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ పరిధిలోని ప్రాంతాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తూ చేసిన మార్పులను, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిస్టం మళ్లింపు సామర్థ్యాన్ని ఏపీ అక్రమంగా పెంచుకున్న విధానం తదితర అంశాలను వైద్యనాథన్ ప్రధానంగా ప్రస్తావించారు. వాస్తవంగా సాగర్ కుడి కాలువ కింద ఆయకట్టు 9.7 లక్షల ఎకరాలు మాత్రమేనని, కానీ ఏపీ దానిని అక్రమంగా 11.74 లక్షల ఎకరాలకు పెంచిందని తెలిపారు. ఇక ఎడమ కాలువ కింద తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షలకు తగ్గించిందని, 1.2 లక్షల ఎకరాలకు రబీకి తడిని ఇవ్వడాన్ని ఉమ్మడి ఏపీ తొలగించిందని, ఫలితంగా తెలంగాణ నీటి అవసరాలు 111టీఎంసీల నుంచి 100 టీఎంసీలకు తగ్గాయని కుట్రపూరితంగా చూపిందని వెల్లడించారు. కానీ ఎడమ కాలువ కింద ఏపీ ప్రాంతంలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఎకరాలకు, నీటి వినియోగాన్ని 20.7టీఎంసీల నుంచి 32.25 టీఎంసీలకు పెంచిందని వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పళనిస్వామి అధ్యయనం ప్రకారం ఏపీకి సాగర్ కింద నీటిఅవసరాలు కేవలం 84.64 టీఎంసీలు ఉంటాయని వివరించారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు కేవలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మాత్రమేనని, అయితే చెన్నైకు తాగునీటి సరఫరా సాకుతో ఉమ్మడి ఏపీ అంతర్రాష్ట్ర ఒప్పందాలను కుదుర్చుకున్నదని వెల్లడించారు. దాని ప్రకారం 1,500 క్యూసెకుల లైనింగ్ చానల్ ద్వారా 15 టీఎంసీలను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉన్నా ఉమ్మడి ఏపీ ఆ ఒప్పందాలను ఉల్లంఘించి పోతిరెడ్డిపాడును విస్తరించిందని తెలిపారు. పీఆర్పీని కాకుండా శ్రీశైలం నుంచి 797 అడుగుల స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీలను తీసుకునేందుకు 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (ఆర్ఎల్ఐఎస్)ను చేపట్టిందని, ఇది నికరజలాలను సైతం మళ్లిస్తుందని, శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ వినియోగాలకు నష్టం చేకూర్చుతుందని తెలిపారు.
ఏపీ శ్రీశైలం నుంచి నీటిని 750 కి.మీ. బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్నదని, తద్వారా బేసిన్లోని తెలంగాణ ప్రాంతాలకు నీరులేకుండా పోతున్నదని వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 11లోని సెక్షన్ 10లోని ప్రాజెక్టులు మిగులు నీటి ఆధారిత కేటాయింపు ప్రాజెక్టులని, ఏపీ తప్పుడు వాదనలు వినిపిస్తున్నదని తెలిపారు. నీటి కేటాయింపులు చేసే అధికారం పునర్విభజన చట్టానికి లేదని, షెడ్యూల్ 11 అనేది రివర్ బోర్డులకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రమేనని తెలిపారు. నేడు కూడా విచారణ కొనసాగనుంది.