భద్రాచలం/హైదరాబాద్, సిటీ బ్యూరో, జూలై 8: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి, సిబ్బందిపై 30 మంది గ్రామస్థులు కర్రలు, చీపుర్లతో మంగళవారం దాడిచేశారు. ఈ ఘటనలో ఈవో స్పృహతప్పి పడిపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమై ఓ వాహనంలో ఆమెను భద్రాచలంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఈ ఘర్షణలో కొందరు సిబ్బం ది కూడా కిందపడిపోయారు. ‘మా రాష్ట్రంలోకి తెలంగాణ అధికారులు వచ్చే అధికారం లేదు’ అని ఈ సందర్భంగా గ్రామస్థులు హెచ్చరించారు. దేవస్థానం భూముల్లో ఆక్రమణదారులు సోమవారం నిర్మాణాలు చేపట్టారు. వీటిని అడ్డుకునేందుకు మంగళవారం వెళ్లిన అధికారులపై గ్రామస్థులు తిరిగబడి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈవో రమాదేవి, ఇతర అధికారులపై జరిగిన దాడి గురించి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ కమిషనర్ వెంకట్రావు, భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆరా తీశారు.
స్వామివారి భూములన్నీ ఏపీలోనే
భద్రాద్రి ఆలయానికి సంబంధించి పొరుగునున్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో 889 ఎకరాల భూమి ఉంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ భూములపై దేవస్థానానికి హక్కు లు లభించాయి. ఇక్కడ రాములోరి భూములను అక్కడి గ్రామస్థులు చాలా ఏండ్లుగా ఆక్రమిస్తూ భవనాలు నిర్మించుకుంటున్నారు. విషయం తెలిసిన ప్రతిసారీ దేవస్థానం అధికారులు అక్కడికి వెళ్లడం, అడ్డగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మా రింది. ఆ తర్వాత షరా మామూలే. ఈ క్రమంలో సోమవారం గ్రామస్థులు దేవస్థానం భూముల్లో పక్కా భవనాల నిర్మాణా లు చేపట్టారు. విషయం తెలిసి మంగళవారం దేవస్థాన ఈవో రమాదేవి సహా 30 మంది సిబ్బంది వెళ్లి నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుని చివరికి అది ఘర్షణకు దారితీసింది. గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. విషయం తెలిసిన ఎటపాక రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల సమక్షంలో చర్చిద్దామని, ఇప్పటికి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఈవో, దేవస్థానం అధికారులకు సూచించారు. ఇందుకు దేవస్థానం అధికారులు అంగీకరించకపోవడంతో గ్రామస్థులు కొందరు కర్రలు, చీపుర్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. మరికొందరు ఉద్యోగులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.
దేవాలయ భూములు ఆక్రమిస్తే పీడీ యాక్ట్: మంత్రి కొండా సురేఖ
కబ్జాకు గురవుతున్న భద్రాద్రి రామయ్య భూములను రక్షించుకునేందుకు వెళ్లిన ఆల య ఈవో రమాదేవిపై దాడి సరికాదని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. దాడులను సహించబోమని చెప్పారు. ఆలయ భూములను ఆక్రమిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తామని హెచ్చరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఈవో రమాదేవిని మంత్రి సురేఖ ఫోన్లో పరామర్శించారు.
ఈవో రమాదేవిపై దాడి హేయం..
భద్రాచల ఆలయ ఈవో రమాదేవిపై భూ ఆక్రమణదారుల దాడిని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ఆలయ భూములకు రక్షణగా విధులు నిర్వర్తించే అధికారులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.