హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ‘కొత్త ప్రభుత్వమని ఇన్నాళ్లు ఓపిక పట్టినం. సర్కారుకు కాస్త వెసులుబాటు ఇవ్వాలని ఆగినం. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపనలు, వినతిపత్రాలిచ్చి వేడుకున్నం. 8 నెలలైనా ఒక్కటి కూడా పరిష్కారం కాక మాపై కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగింది. రాష్ట్రస్థాయి క్యాడర్‌కు మేం సమాధానం చెప్పుకోగలుగుతున్నాం కానీ కింది స్థాయి క్యాడర్‌కు చెప్పుకోలేకపోతున్నం. వాళ్లు వినేలా లేరు. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గతంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగులమంతా జేఏసీగా ఏర్పడ్డం.. కొట్లాడినం. మళ్లీ ఇప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడాల్సి వచ్చింది.’ ‘మేమేం గొంతెమ్మ కోరికలు కోరడంలేదు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నం. తక్షణమే మూడు డీఏలు చెల్లిస్తం.. సకాలంలో డీఏలు ప్రకటించి బకాయిలు నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తం.. 15 పనిదినాల్లో సప్లిమెంటరీ బిల్లులు చెల్లిస్తం.. సీపీఎస్‌ను రద్దుచేస్తం.. ఆరు నెలల్లో కొత్త పీఆర్సీ అమలు చేస్తమని అభయహస్తం మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు కొట్లాడాలె అని గతంలో రేవంత్‌రెడ్డే ఉద్యోగులకు పిలుపునిచ్చిండ్రు. ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని కొట్లాడేందుకు సిద్ధమైనం.’
సోమవారం జరిగిన ఎంప్లాయిస్ జేఏసీ ఆవిర్భావ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల మాటలివి ఈ మాటలను బట్టి చూస్తుంటే రేవంత్‌రెడ్డి సర్కారు తీరుపై ఉద్యోగులు ఎంతగా రగిలిపోతున్నారో అర్థంచేసుకోవచ్చు. క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి తీవ్రమవుతున్నదని, అందుకే తాము ఉద్యమబాట పట్టామని ఉద్యోగ సంఘాల నేతలే అంటున్నారంటే వారు సర్కారు తీరుపై ఎంత కోపంగా ఉన్నారో తెలుసుకోవచ్చు. అలవిగాని హామీలిచ్చి అమలుచేయలేక చేతులెత్తేసిన రేవంత్ సర్కారుపై రాష్ట్రంలోని ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉద్యోగులను నాడు కేసీఆర్ ఆదరించిన తీరు, నేడు పట్టించుకోవడమే కాదు.. కనీసం కలిసేందుకూ సమయమివ్వని రేవంత్‌రెడ్డి సర్కారు వ్యవహారాన్ని ఉద్యోగులంతా పోల్చి చూసుకుంటున్నారు.
ప్రజా ప్రభుత్వమంటే ఉద్యోగ సంఘాలను కలవకుండా ఉండటమేనా? అని ప్రశ్నిస్తున్నారు. మ్యానిఫెస్టోలో పెట్టి మోసం చేసిన తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ‘నా తలుపులు తెరిచే ఉంటాయి.. ఎప్పుడైనా నన్ను కలవొచ్చు’ అని పలుమార్లు ప్రకటించిన రేవంత్‌రెడ్డి, తమను ఇంత వరకు కలవలేదని, సమస్యలపై చర్చించలేదని ఉద్యోగ సంఘాల నేతలే మండిపడుతున్నారు. ఓ సారి రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో రేవంత్ సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చి వెనక్కి రావాల్సి వచ్చింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు) రేవంత్ ఇంటి ముట్టడికి పిలుపునివ్వగా, టీచర్లంతా ఆయన ఇంటి ముందు పడిగాపులు పడాల్సి వచ్చింది.
సీఎంను కలిసి వినతిపత్రం సమర్పిద్దామంటే ఆఖరుకు ఇంటిలోపలికి తీసుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది సీఎం బిజీగా ఉన్నారని, కలవలేరని చెప్పడంతో చివరికి సీఎం వ్యక్తిగత కార్యదర్శికి టీచర్లంతా వినతిపత్రాన్ని సమర్పించాల్సి వచ్చింది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్ సందర్భంగా కొంత మంది టీచర్ల సంఘాల నేతలను ప్రభుత్వమే సీఎం ఇంటికి పిలిపించింది. కానీ సమస్యలపై చర్చించకుండా, వినతిపత్రాలు స్వీకరించకుండా సీఎంతో కేవలం ఫొటోలు తీయించి పంపించారు. వీటన్నింటినీ తలుచుకుని సంఘాల నేతలంతా కుతకుతలాడిపోతున్నారు. మొత్తంగా ఉద్యోగ సంఘాలు పోరాడానికి సిద్ధపడటం, రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి రావడం.. జేఏసీగా ఏర్పడటాన్ని రాష్ట్రంలోని ఉద్యోగులు స్వాగతిస్తున్నారు.
ఉద్యోగులతో ఏ సర్కారు ఎలా వ్యవహరించిందన్న దానిపై రాష్ట్రంలోని ఉద్యోగులు బేరీజు వేసుకుంటున్నారు. నాడు కేసీఆర్ కల్పించిన సౌకర్యాలు, ఇప్పటి పరిస్థితులను పోల్చుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐఆర్, పీఆర్సీల కోసం ఉద్యోగులు ఆందోళలన చేసిన రోజులున్నాయి. ఐదు రూపాయల డీఏ కోసం 56 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భాలున్నాయి. కానీ ఉద్యోగుల పక్షాన ఉండే బీఆర్ఎస్ సర్కారు, అతి తక్కువ కాలంలోనే పీఆర్సీ కమిటీని నియమించింది. మెరుగైన ఫిట్మెంట్ వర్తింపజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 10వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ కేవలం 28శాతం ఫిట్మెంట్ మాత్రమే సిఫారసు చేసింది.
తర్వాత తెలంగాణ ఏర్పాటు, ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడంతో పీఆర్సీ కమిషన్ సిఫారసులతో సంబందం లేకుండా ఉద్యోగులు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేస్తే అంతకంటే ఒకటి ఎక్కువ ఉండాలన్న సంకల్పంతో 2015లో 43శాతం ఫిట్మెంట్తో తెలంగాణ ఇంక్రిమెంట్‌ను ప్రకటించి ఉద్యోగుల్లో సంతోషం నింపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఆర్ బిశ్వాల్ కమిటీ మొదటి పీఆర్సీ కాగా, తాజాగా శివశంకర్ అధ్యక్షతన ఏర్పాటైంది. సీఆర్ బిశ్వాల్ కమిటీ కేవలం 7.5శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం 30శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. అంటే 22.5శాతం అధికంగా ఫిట్మెంట్ వర్తింపజేసింది.
కరోనా కల్లోలం పీడించినా, ఆర్థికంగా వెలుసుబాటు లేకపోయినా ప్రభుత్వంపై ఏడాదికి రూ.12,595 కోట్ల అదనపు భారం పడినా ఉద్యోగులతో గల పేగుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని భరించేందుకు సిద్ధపడింది. ఇప్పుడున్న శివశంకర్ పీఆర్సీ కమిషన్ కూడా కేసీఆర్ సర్కారు నియమించిందే. ఈ కమిషన్ గడువు ఏప్రిల్ 2తో ముగియగా రేవంత్‌రెడ్డి సర్కారు కమిషన్ నివేదికను తెప్పించుకోలేక కమిషన్ గడువును ఆరు నెలలు పొడగించింది. వీటన్నింటిపైనా ఉద్యోగులు బేరీజు వేసుకుంటున్నారు.
ఉద్యోగ సంఘాల జేఏసీ అల్టిమేటం జారీచేయడం, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించడంతో కాంగ్రెస్ సర్కారులో వణుకుపుట్టింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతల భవిష్యత్తు కార్యాచరణపై ఆరా తీస్తున్నది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఉద్యోగ సంఘాల నేతలపై నిఘా పెట్టాయి. నేతల కదలికలను పసిగట్టేపనిలో పడ్డాయి. పైగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతున్నదో చెప్పాలంటూ నేతలకు ఫోన్లు చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.