హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. డీఎస్సీకి హాజరైన అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్ఎల్)ను జిల్లాలు, పోస్టులవారీగా వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 7 నుంచి ఆగస్టు 5 వరకు కం ప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహించగా, 2.46 లక్షల మంది హాజరయ్యారు. డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి జీఆర్‌ఎల్‌ను విడుదల చేశారు.
జీఆర్ఎల్ విడుదలైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ 1:3 చొప్పున అభ్యర్థులను ఎంపికచేస్తుంది. జిల్లాల వారీగా, పోస్టులు, రోస్టర్ వారీగా జాబితాలను జిల్లాలకు పంపిస్తుంది. మొత్తంగా 33 వేల మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేస్తారు. వీరికి మంగళవారం నుంచి ఈ నెల 5 వరకు ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. ఇది ముగిసిన తర్వాత 1:1 చొప్పున అభ్యర్థులను ఎంపికచేసి, ఈ నెల 9 ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేస్తారు.
డీఎస్సీ ఫలితాల విడుదల తర్వాత డీఎస్సీ వెబ్సైట్ మొరాయించింది. అభ్యర్థులంతా ఒకేసారి ఫలితాలు తెలుసుకునేందుకు తాపత్రయపడటంతో వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. రాత్రి తర్వాతే ఫలితాల పై అభ్యర్థులకు ఒక స్పష్టతవచ్చింది. విద్యాశా ఖ రూపొందించిన రివైజ్డ్ ఫైనల్ కీ’ ప్రకారమే డీఎస్సీ ఫలితాలను ప్రకటించారు. గతంలో విడుదలచేసిన ఫైనల్ కీపై అభ్యంతరాలు రావడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పరిశీలన జరిపిన అధికారులు రివైజ్డ్ పైనల్ కీని తయారుచేశారు. మొత్తం నాలుగైదు ప్రశ్నలకు సమాధానాలు మారినట్టు అధికారులు తెలిపారు.
నెల్లికుదురు, సెప్టెంబర్ 30: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెంలో నిరుపేద కుటుంబానికి చెందిన బండారి ఎల్లమ్మ-రామరాజు దంపతుల కుమారుడు నరేశ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న వయసులోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందడం తో కుటుంబ బాధ్యతలు మీదపడ్డాయి. చెల్లి, తమ్ముడికి పెండ్లి చేశాక తాను పెండ్లి చేసుకున్నాడు. తెలంగాణ ప్రభు త్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేయగానే ఎలాంటి కోచింగ్ లే కుండా పట్టుదలతో చదివాడు. 76.67 మార్కులు సాధించి ఎస్ఏ తెలుగు సబ్జెక్టులో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
మరికల్, సెప్టెంబర్ 30: నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన జం పుల గోపాల్ తెలుగు పం డిట్ విభాగంలో జిల్లాలో ఫస్ట్ ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో జిల్లా 3 వ ర్యాంకు సాధించాడు. ఆయన పెద్ద కొడుకు భానుప్రకాశ్‌కు గణిత విభాగంలో ఎస్‌ఏగా జిల్లాలో 9వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల చిన్న కుమారుడు చంద్రకాంత్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈగా ఉద్యోగం సాధించాడు. గోపాల్ భార్య విజయలక్ష్మి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలోని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నారు.
మహదేవపూర్ (కాళేశ్వరం), సెప్టెంబర్ 30: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన గుండోజి నగేశ్ సోమవారం ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ చాటాడు. తెలుగు పండిత్లో జిల్లాలో రెండో ర్యాంక్, ఎస్జీటీలో 38వ ర్యాంక్ సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన నగేశ్ తండ్రి బ్రహ్మయ్య కులవృత్తి చేసుకుంటా నలుగురు పిల్లలను చదివించాడు. నగేశ్ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివి ఒకేసారి రెండు కొలువులకు ఎంపికయ్యాడు. కన్నవారి కండ్లల్లో ఆనందాన్ని నింపాడు.