Revanth Reddy | అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సర్కార్ విద్యను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తూ, కార్పొరేట్ స్కూళ్ల వ్యవస్థకు వంతపాడుతూ వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ప్రభుత్వ పాఠశాలలపై తనకున్న దురుద్దేశాన్ని బయటపెట్టారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉండి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రోత్సహించి బలోపేతం చేయాల్సింది పోయి అసలు ఇన్నిగనం ప్రభుత్వ పాఠశాలలే అవసరం లేదని తేల్చిపారేశారు.
గతంలోనూ ‘టీచర్లు బోధనను పక్కనపెట్టి రాజకీయాల్లో పాల్గొంటున్నరు’.. ‘తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నయ్’ అని వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నదన్నట్టుగా మాట్లాడారు. అసలు తెలంగాణకు 27 వేల స్కూళ్లు అవసరమే లేదని, 4 వేల బడులు చాలని చెప్పి ఏకంగా ప్రభుత్వ పాఠశాల విద్యనే ఎత్తేసే కుట్రకు తెరతీశారు.
హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి.. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.. విద్యాబోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై అక్కసు వెళ్లగక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తాజాగా సర్కార్ స్కూళ్ల మూసివేతపైనా అలాంటి వ్యాఖ్యలే చేశారు. టీచర్లను తక్కువచేసి మాట్లాడటం.. ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదించాలనుకోవడం ద్వారా సర్కారీ విద్యావ్యవస్థపై విషంకక్కేలా ముఖ్యమంత్రి తన మనసులో ఉన్న కుట్రను వెళ్లగక్కారు. ‘రాష్ట్రంలో 27వేల పాఠశాలు అవసరం లేదు.. వాటిని నాలుగు వేలకు తగ్గిస్తాం’ అని శనివారం బెంగళూరులో ‘ది హిందూ హడిల్ కాన్క్లేవ్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో మనకు రవాణా సౌకర్యం ఉండేది కాదు. కాబట్టి గూడేలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేశారు. అది అవుట్ డేటేడ్ మాడల్. ఇప్పుడు ఒక క్లస్టర్ క్రియేట్ చేయాలి.
మనకున్న 27వేల స్కూళ్లను 4వేలకు తగ్గించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. ఆ విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం’ అని తెలిపారు. తద్వారా సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా 23వేల ప్రభుత్వ పాఠశాలలను కుదిస్తామని చెప్పడం గమనార్హం. తండాకో.. గూడేనికో స్కూల్ అన్నది అవుట్ డేటెడ్ విధానమని, క్లస్టర్‌కో స్కూల్ ఉండాలన్నది తమ విధానమని సీఎం ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను గమనిస్తే తండాలు, గూడేల్లో ఉన్న స్కూళ్లను త్వరలో మూసివేయబోతున్నారని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో టీచర్లపై ముఖ్యమంత్రి నోరుపారేసుకొని వారిలో అసంతృప్తికి కారణం కాగా, ఇప్పుడు పాఠశాలల కుదింపుపై చేసిన ప్రకటన కూడా వివాదాస్పదమవుతున్నది.
సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సింగిల్ టీచర్ స్కూళ్లు ఉండి ఏం లాభం? ఒకటో తరగతిలో ఇద్దరుముగ్గురు. రెండో తరగతిలో ముగ్గురు. ఐదు తరగతుల్లో పది మంది లోపు విద్యార్థులుంటే టీచర్లు ఎలా బోధించగలరు? గతంలో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాల్లో సింగిల్ టీచర్ స్కూళ్లను నడుపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ మాడల్ కాలగర్భంలో(దిస్ మాడల్ ఔట్‌డేటెడ్) కలిసిపోయింది. దీనికి పరిష్కారంగా 27వేల స్కూళ్లను నాలుగు వేలకు కుదిస్తాం. ప్రతి తరగతిలో 30మంది విద్యార్థులుండేలా రేషనలైజేషన్ చేస్తాం. టెక్నాలజీని వాడుకుని ఖాన్ అకాడమీ.. వంటి సంస్థ ద్వారా టీచర్లు, విద్యార్థులకు పాఠాలు బోధించనున్నాం’ అని చెప్పారు. విదేశాల్లో అధ్యయనం కోసం ఈ ఏడాది వంద మంది టీచర్లను పంపినట్టు సీఎం వెల్లడించారు.
‘ప్రైవేట్ స్కూళ్ల విజయానికి ప్రధాన కారణం విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడమే. ఇదే తరహాలో మేము కూడా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. ఇకపై విద్యార్థుల వద్దకే బస్సులు పంపి ఇంటి నుంచే పికప్ చేసుకుంటాం. అని సీఎం చెప్పారు. ‘విద్యార్థులకు బడుల్లో ఉచితంగా నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్.. మధ్యాహ్న భోజనం అందిస్తాం. సాయంత్రం వేళల్లో ప్రత్యేకంగా లాంగ్వేజెస్, సబ్జెక్టులపై పట్టు సాధించేలా ప్రత్యేక ట్యూటర్లను నియమిస్తాం. కార్పొరేట్ కంపెనీల సీఎస్సార్ ఫండ్స్‌తో ట్యూటర్లకు వేతనాలు చెల్లిస్తాం’ అని తెలిపారు.