Telangana | రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలంటూ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. దీనిపై తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్‌గా ఉంది. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనకు దిగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పోలీసు బెటాలియన్స్‌లో ఆందోళన చేసిన వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. వారిపై శాఖపరమైన చర్యలకు సిద్ధమైంది.
పోలీసు శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘనను సహించమని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఏదేమైనా క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదని అన్నారు. ఎంతోకాలం నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మన దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థనే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. పోలీసులు ఆందోళన చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనే అని స్పష్టం చేశారు.
The Police Forces (Restriction of Rights) Act, The Police (Incitement to Disaffection) Act, Police Manual ప్రకారం పోలీసులు విధులను బహిష్కరించడం, రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన చర్యగా భావిస్తున్నామని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించకూడదని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు చేసిన కానిస్టేబుళ్లపై ఈ రెండు చట్టాల ప్రకారం చర్యలకు ఆదేశాలిచ్చారు.