హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఉగ్రదాడికి ముష్కరులు పన్నిన కుట్రను భగ్నం చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఇటీవల విజయనగరం, హైదరాబాద్‌లో పట్టుబడిన పట్టుకున్న నిందితుల వ్యవహారంపై స్పందిస్తూ కుట్రను ముందుగానే గుర్తించామని వెల్లడించారు. అటు మావోయిస్టులు లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పలు కార్యక్రమాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ వివిధ అంశాలపై వివరాలు వెల్లడించారు. భారతీయ న్యాయసంహిత కొత్త క్రిమినల్ చట్టాల కింద నిరుడు జులై నుంచి ఇప్పటివరకు 1,37,644 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1251 జీరో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసినట్టు వెల్లడించారు. 90 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన కేసులను ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయుధాలకు సంబంధించి 7125 లైసెన్స్‌లు జారీ కాగా, వాటితో అనుబంధంగా 9294 ఆయుధాలు ఉన్నాయని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందితో ఏర్పాటైన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాల ప్రదర్శనను డీజీపీ పర్యవేక్షించారు. వరదల్లో బాధితులను కాపాడేందుకు 1,000 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో డీజీ శిఖాగోయెల్, అడిషనల్ డీజీలు మహేశ్ భగవత్, వీవీ శ్రీనివాసరావు, అనిల్‌కుమార్, సంజయ్‌కుమార్‌జైన్, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్, సీపీలు సుధీర్‌బాబు, డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.